calender_icon.png 18 December, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం

18-12-2025 01:41:53 AM

వనపర్తి, డిసెంబర్ 17 ( విజయక్రాంతి ) : వనపర్తి జిల్లాలో బుధవారం మూడో విడత పోలింగ్ జరిగిన పాన్గల్, పెబ్బేరు, శ్రీరంగాపూర్, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.

పోలింగ్ ఉదయం 7 గంటల నుండి ప్రారంభమయి మధ్యా హ్నం 1.00 గంట వరకు జరిగిన గ్రామ పంచాయతీ  ఎన్నికల పోలింగ్ తీరును కలెక్టరేట్లోని సమావేశం మందిరం నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, సాధారణ ఎన్నికల పరిశీలకులు మల్లయ్య భట్టు, వ్యయ పరిశీలకులు శ్రీనివాస్ తో కలిసి పర్యవేక్షించారు. 

జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూమ్ నుండి మాత్రమే కాకుండా శ్రీరంగాపురం మండలం వెంకటాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రం, శ్రీరంగాపూర్ మండల కేంద్రం, పెబ్బేరు మండలం కంచిరావు పల్లి గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ జరుగుచున్న ప్రక్రియను పరిశీలించారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ భద్రతలు కట్టుదిట్టం చేశారు.

కంచిరావు పల్లి గ్రామంలో మీడియాతో మాట్లాడిన కలెక్టర్ ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని  తెలియజేశారు. మూడో విడతలో పోలింగ్ జరిగిన పాన్గల్, పెబ్బేరు, శ్రీరంగాపూర్, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల్లో మొత్తం కలిపి 1,11,357 ఓట్లు పోల్ కాగా, 85.55% వోటింగ్ పర్సంటేజీ నమోదయింది. వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.

శ్రీరంగాపూర్, వెంకటాపూర్ పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షణ

వనపర్తి క్రైమ్, డిసెంబర్ 17: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో, శ్రీరంగాపూర్, వెంకటాపూర్ గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ సునిత రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తూ పరిస్థితిని క్షేత్ర స్థాయిలో సమీక్షిస్తున్నారు. పోలింగ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... ఓటర్లు భయభ్రాంతులకు గురికాకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీసులు పూర్తి స్థాయి భద్రతను కల్పిస్తున్నారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 163  బిఎన్‌ఎన్‌ఎస్ 44 సెక్షన్) అమలులో ఉందని, ఐదుగురు అంతకన్నా ఎక్కువ మంది గుంపులుగా చేరడం నిషేధమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ. నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్, శ్రీనివాస్, శ్రీరంగాపూర్ ఎస్త్స్ర, హిమబిందు, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.

దివ్యాంగున్ని ఆప్యాయంగా పలకరించిన ఎస్పీ సునిత రెడ్డి..

వనపర్తి క్రైమ్ డిసెంబర్ 17 : వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామంలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల వేళ బుధవారం  ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓ దివ్యాంగ ఓటరితో జిల్లా ఎస్పీ సునిత రెడ్డి ఆప్యాయంగా పలకరించారు.  భద్రతా పర్యవేక్షణలో భాగంగా పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ  ఆ దివ్యాంగుని పరిస్థితిని గమనించి, అధికారిక హోదాను పక్కన పెట్టి, మనిషిగా ముందుకు వచ్చి ధైర్యం తెలిపారు.

పుల్లూరులో ఓటేసిన ఎమ్మెల్సీ చల్లా, ఎమ్మెల్యే విజయుడు స్వగ్రామంలో ఓటేసిన గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరిత 

అలంపూర్ డిసెంబర్ 17 అలంపూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 68 గ్రామపంచాయతీలకు సంబంధించి బుధవారం మూడో విడత  ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల అధికారులు పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.ఉదయం ఏడు గంటలకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. జిల్లా ఉన్నతాధికారులు ఆయా మండలాల్లో పర్యటించి పోలింగ్ సరలిని పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తమ స్వగ్రామమైన పుల్లూరులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా గద్వాల కాంగ్రెస్ పార్టీ బాధ్యురాలు సరిత తిరుపతయ్య జల్లాపురం గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అబ్రహం తమ స్వగ్రామమైన వల్లూరులో ఓటు వేశారు.

మానవపాడు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

చివరి విడత ఎన్నికలు బుధవారం జరుగుతున్న నేపథ్యంలో మానవపాడు మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. ఎలాంటి ఆవంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా  బందోబస్తు ఏర్పాటు చేసి సూచనలు చేశారు.

జిల్లాలో 83.1 శాతం ఓటింగ్ నమోదు

అచ్చంపేట, డిసెంబర్ 17: గ్రామ సంగ్రామంలో కీలకమైన చివరి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు నాగర్ కర్నూల్ జిల్లాలోని ఏడు మండలాల్లో బుధవారం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల పక్రియను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోశ్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఎప్పటికప్పుడు  పరిశీలించారు. అచ్చంపేట, బల్మూర్, లింగాల, చారగొండ, ఉప్పునుంతల, అమ్రాబాద్, పదర మండలాలలోని 134 గ్రామ పంచాయతీలలో సర్పంచు, 1,064 వార్డు సభ్యలులకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకే గ్రామాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి బారులు తీరారు.

మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగియగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎన్నికల ఫలితాల లెక్కింపును ఆరంభించారు. జిల్లాలోని 7 మండలాల్లో 1,79,464, ఓట్లకు, 1,49,222 మంది 83.01 శాతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అత్యధికంగా ఉప్పనుంతల మండలంలో 87.3 శాతం, అత్యల్పంగా అమ్రాబాద్ మండలంలో 75.6 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అచ్చంపేట మండలంలో 86.09 శాతం, బల్మూర్ మండలంలో 80.06, లింగాల మండలంలో 81.02, పదర మండలంలో 81.05, చారగొండ మండలంలో 86.06 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బాదావత్ సంతోశ్ వెల్లడించారు.

భారీ బందోబస్తు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.  ముందస్తుగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అధనపు బలగాలను మోహరించారు. ఫలితాల లెక్కింపు సమయంలోనూ గొడవలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. బల్మూర్ మండలం జినుకుంటలో పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.