calender_icon.png 18 December, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుదివిడత ప్రశాంతం

18-12-2025 01:45:32 AM

  1. నిజామాబాద్ జిల్లాలో సాఫీగా ముగిసిన పోలింగ్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 76.45% పోలింగ్ నమోదు 

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ 

నిజామాబాద్, డిసెంబర్ 17 (విజయ్ కాంత్) : నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ప్రశాంతంగా ముగిసింది. మూడు విడతలలోనూ ఎన్నికలు సజావుగా కొనసాగాయని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. 3వ విడత పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమయ్యింది. చలిని సైతం లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. ఉదయం 9.00 గంటల సమయానికి సగటున 23.35 శాతం పోలింగ్ నమోదయ్యింది.

11 గంటల సమయానికి 54.69 శాతం ఓటింగ్ పూర్తయ్యిందని అధికారులుప్రకటించారు.మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన ఓటింగ్ కు సంబంధించి 74.36 శాతం పోలింగ్ నమోదయ్యింది. తుది పోలింగ్ 76.45 శాతం పోలింగ్ జరిగినట్టు అధికారులు తెలిపారు. కాగా, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బాల్కొండ, అంకాపూర్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును, పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. హెల్ప్ డెస్క్ లు, మెడికల్ క్యాంపు, ఇతర అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా? అని తనిఖీ చేశారు. 

కలెక్టర్ పర్యవేక్షణలో ఆర్మూర్, బాల్కొండ, భీమ్గల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల  మండలాల పరిధిలో ఓటింగ్ నిర్వహణ కోసం అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మూడవ విడతలో మొత్తం 165 సర్పంచ్ స్థానాలకు గాను, నామినేషన్ల ఉపసంహరణ నాటికే 19 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 146 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అదేవిధంగా మొత్తం 1620 వార్డు స్థానాలకు గాను 490 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వీటిని మినహాయిస్తూ, 1130 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

1490 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, భారీగా ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఎక్కడికక్కడ ఓటింగ్ ఆవశ్యకతను వివరిస్తూ వివిధ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, ఫొటోలతో కూడిన ఓటరు స్లిప్పులను పంపిణీ చేయడం, బీ.ఎల్.ఓలతో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసి ఓటర్లకు వారి ఓటు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది అనే విషయాన్ని తెలియజేసేలా చర్యలు తీసుకోవడంతో ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటరు ఐ.డీ కార్డు లేని పక్షంలో ఎన్నికల సంఘం ధృవీకరించిన 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని చూపించి ఓటు వేయవచ్చని విస్తృత ప్రచారం చేయడం సత్ఫలితాలు ఇచ్చిందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. మూడు విడతలలోనూ పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగిందని, ప్రశాంత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయించామని, వెబ్ క్యాస్టింగ్ జరిపించామని, మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ తీరును నిశితంగా పరిశీలన చేశారని అన్నారు. కలెక్టరేట్ నుండి కూడా ఆయా పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ ద్వారా ఓటింగ్ తీరును, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరిగిందన్నారు. 

మద్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగగా, నిర్ణీత సమయం లోపు క్యూ లైన్లలో నిలుచున్న వారికి కూడా ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఓటు వేసే అవకాశం కల్పించామని అన్నారు. మద్యాహ్నం 2.00 గంటల నుండి కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఓట్ల లెక్కింపును చేపట్టి ఫలితాలను వెల్లడించేలా విస్తృత చర్యలు చేపట్టామన్నారు.

కౌంటింగ్ సందర్భంగా ఏ చిన్న తప్పిదానికి సైతం తావులేకుండా జాగ్రత్తగా ఓట్ల లెక్కింపు జరపాలని కలెక్టర్ అధికారులకు ఈ సందర్భంగా సూచించారు. కాగా, ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సైతం పోలింగ్ కేంద్రాలను విస్తృతంగా సందర్శిస్తూ ఓటింగ్ తీరుతెన్నులను పరిశీలన జరిపారు. భీంగల్, బడా భీంగల్, రామన్నపేట్, మోర్తాడ్, కమ్మర్పల్లి, అంకాపూర్, ముప్కాల్, బాల్కొండ 

తదితర పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఆర్మూర్ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి అంకాపూర్ జెడ్పీ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.