28 February, 2026 | 1:09 PM

Breaking News

లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ   •   అనురాగ్ యూనివర్సిటీ కి ప్రతిష్టాత్మక ఎన్​పీటీఈఎల్ అవార్డు   •   కన్నతల్లిపై పెట్రోల్ పోసి కాల్చి చంపిన తనయుడు   •   నిర్మాణ పనుల్లో భద్రత గాలిలో...!   •   హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ: 15 మందికి గాయాలు   •   మున్సిపల్ వార్డులో పర్యటించిన చైర్మన్ నగేష్ శేట్కార్   •   వైభవంగా శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం వేడుకలు..   •   మాందాపూర్ ప్రాథమిక పాఠశాల జాతీయ స్థాయికి నామినేట్   •   ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలనే వన్ హెల్త్ ఫార్మసీ ఏర్పాటు   •  

ప్రజాస్వామ్యం ఖూనీ

18-12-2025 12:58 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి) : అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్పీకర్ నిర్ణయంపై స్పందిస్తూ, దేశ అత్యున్నత న్యాయస్థానాలపైనే కాదు, చివరికి రాజ్యాంగంపై కూడా రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం గౌరవం లేదని మరోసారి తేలిపోయిందని విమర్శించారు.

కేవలం ఫొటోలకు ఫొజులిచ్చేందుకు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగితే సరిపోదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సొంత తండ్రి రాజీవ్ గాంధీ తెచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టాన్నే గౌరవించలేని అసమర్థ నాయకుడిగా రాహుల్ గాంధీ చరిత్రలో మిగిలిపోతారని స్పష్టం చేశారు. అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు సాక్షాత్తు ఫిరాయింపు ఎమ్మెల్యేలే అనేకసార్లు బాహాటంగా ప్రకటించినా, వారిని కాపాడటం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం అని మండిపడ్డారు. 

ఉప ఎన్నికల భయంతోనే వెనకడుగు

రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనా వైఫల్యాలపై పంచాయతీ ఎన్నికల వేళ పల్లెపల్లెనా ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతోందని, ఆ భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలు అంటే జంకుతోందని కేటీఆర్ విమర్శించారు.  అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తోందన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి మరీ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులకు తెరతీసిన నాటి నుంచి, నేటి స్పీకర్ నిర్ణయం వరకు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అడుగడుగునా అపహాస్యం చేస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.