10-02-2026 12:00:00 AM
రంగారెడ్డి, ఫిబ్రవరి ౯(విజయక్రాంతి): జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక ఘట్టం పూర్తయింది. ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ, పోలింగ్ సిబ్బందికి సంబంధించి మూడవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. సాధారణ పరిశీలకులు మాయాంక మిట్టల్, జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి సి.నారాయణ రెడ్డి సమక్షంలో ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించారు.
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు గాను ఈ క్రింది సిబ్బందిని ర్యాండమైజేషన్ పద్ధతిలో కేటాయించినట్లు చెప్పారు.ప్రిసైడింగ్ అధికారులు (PO),సహాయ ప్రిసైడింగ్ అధికారులు (APO) కౌంటింగ్ సిబ్బంది మైక్రో అబ్జర్వర్లు కు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల విధులకు సంబంధించి ఎవరైనా గైర్హాజరైనా లేదా విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సిబ్బంది అందరూ సహకరించాలని కోరారు.కార్యక్రమంలో డీపిఓ సురేష్ మోహన్, జీఎం డి.ఐ.సి. శ్రీలక్ష్మి మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.