1 June, 2026 | 1:57 AM

ధాన్యం తరలింపును వేగవంతం చేయాలి

01-06-2026 01:26 AM

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ, మే 31 (విజయక్రాంతి): ధా న్యం తరలింపును వేగవంతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కేంద్ర నిర్వా హకులను అదేశించారు. ఆదివారం, జనగామ మండలంలోని అడవికేశవాపూర్, ఎర్రగొల్లపహాడ్, షామీర్పేట్, వడ్లకొండ, గానుగుపహాడ్, వెంకిర్యాల, అలాగే నర్మెట్ట మండలంలోని వెల్దండ, అమ్మాపూర్, హన్మంతాపూర్, అదే విధంగా తరిగొప్పుల మండలంలోని పోతారం, సోలిపూర్, తరిగొప్పుల గ్రామ పంచాయతీల పరిధిలో గల ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా క్షేత్రస్థాయిలో పర్యటించి, సందర్శించి, ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

ఈ సందర్భంగా కొనుగోలు ప్రక్రియ, ధాన్యం నిల్వలు, రవా ణా ఏర్పాట్లు, రైతులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించి, కేంద్ర నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. రైతులు ఎంతో శ్రమించి పండించిన వరి ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చిన వెంటనే ఎటువంటి ఆలస్యం లేకుండా తూకం వేసి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా సకాలంలో మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అకాల వర్షాలు ఉన్నందున కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ప్రత్యేక అప్రమత్తతతో వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను టార్పాలిన్లతో పూర్తిగా కప్పి భద్రపరచాలని ఆదేశించారు. కేంద్రాల్లో తూకం ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్వహిస్తున్న రికార్డులు, కొనుగోళ్ల నమోదు పుస్తకాలు, ట్రక్ షీట్లను, ఓపీఎంఎస్ నమోదులను కలెక్టర్ తనిఖీ చేశారు.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో సరిపడా లారీలను అందుబాటులో ఉంచుకొని, మిల్లులకు తరలించడం ద్వారా కేంద్రాల వద్ద నిల్వలు పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా, ప్రతి గింజ సజావుగా కొనుగోలు చేసేలా అంకితభావంతో పని చేయాలని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో కలెక్టర్ రైతులతో మాట్లాడి, అకాల వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి, బస్తాలను సురక్షితంగా నిల్వ కేంద్రాలు, మిల్లులకు తరలించే చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు అమలు చేస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా,  రైతు ప్రయోజనాల పరిరక్షణే ప్రధాన బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేస్తూ, ప్రతి రైతుకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.