7 April, 2026 | 2:20 AM

వీటో వలయంలో ఐరాస

07-04-2026 12:00 AM

ఆకాశమంతా అభివద్ధి ఒకవైపు జరుగుతున్న ఈ కాలంలో మరోవైపు ప్రపంచమంతా యుద్ధాలు, మానవతా సం క్షోభాలు భూమిని రక్తంతో తడిపేస్తున్నాయి. దేశాల మధ్య శాంతిసామరస్యాలు, సహకారం లేకపోవడంతో ఎప్పుడు ఏ దేశం.. మరో దేశంపై దాడులు చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ సందర్భంలో ప్రపంచ శాంతి, భద్రత, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడిన ఐక్యరాజ్య సమితి (ఐరాస) తన అసలు పాత్రను ఎంత వరకు నెరవేర్చుతోన్నదనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదులుతోంది. ఒకప్పుడు ప్రపంచానికి ఆశాకిరణంగా కనిపించిన ఈ సంస్థ నేడు ప్రపంచ సంక్షోభాల ముందు ఎందు కు మౌనంగా నిలుస్తోంది? ఇది కేవలం ఒక సంస్థ వైఫల్యమా? లేక అంతర్జాతీయ రాజకీయాల నిర్మాణాత్మక లోపాల ప్రతిబింబ మా? అనే ప్రశ్న మరింత గట్టిగా వినిపిస్తోంది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1945 లో ఇకపై యుద్ధాలు జరగకూడదనే సంకల్పంతో నాటి పాలకులు మానవాళి శాంతి, భద్రత, సహకారమనే మూడు స్థంభాలపై నిలబడేలా ఏర్పాటు చేసిన గొప్ప సంస్థ  ఐక్యరాజ్య సమితి. ఇది శాంతి భద్రతలను కాపాడడం, దేశాల మధ్య వివాదాలను పరిష్కరించడం, మానవ హక్కుల ను పరిరక్షిం చడం, అభివద్ధిని ప్రోత్సహించడం వంటి మహోన్నత లక్ష్యాలతో ఏర్ప డింది. కానీ, కాలక్రమేణా ఈ సంస్థలోని భద్రతామండలి నిర్మాణం, వీటో అధికారం, రాజకీయ ప్రయోజనాల ముందు బలహీనపడిందనే విమర్శలు పెరుగుతున్నాయి. 

ఐరాస ఏర్పడినప్పుడు దాని వెనుక ఒక గొప్ప సంకల్పం ఉంది. కానీ, ఆ సంకల్పం కాలక్రమేణా బలహీనపడింది. ఐదు శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిట న్, ఫ్రాన్స్‌లకు వీటో పవర్ అనే ప్రత్యేక ఆధికారం ఉంది. వీటో హక్కు ద్వారా ప్రపంచ నిర్ణయాలను ఇవి ఒక్కసారిగా నిలిపివేయగలవు. ఐక్యరాజ్యసమితిలో అందరి స్వరం వినిపించినా చివరి మాట మాత్రం ఈ ఐదు దేశాలదే. వీటో పవర్ ఒకే దేశం మొత్తం ప్ర పంచ అభిప్రాయాన్ని అడ్డుకునే శక్తిని ఇస్తుంది.

ఈ వీటో శక్తి కారణంగా ఐరాస స్పష్టమైన చర్యలు తీసుకోలేకపోతోంది. దీం తో ఒక దేశం తన జాతీయ ప్రయోజనాల కోసం ప్రపంచ శాంతిని బలిగొనే పరిస్థితి ఏర్పడింది. లక్ష్యాలు ఎంత గొప్పవైనా, వాటిని అమలు చేసే నిర్మాణం బలహీనంగా ఉంటే ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఐరాస విషయంలో ఇదే జరిగింది. ఐదు దేశాలకు ఉన్న వీటో పవర్ ఈ సంస్థకు ఒకేసమయంలో శక్తి, శాపంగానూ మారింది.

వీటో హక్కు ఓ తీర్మానాన్ని కేవలం ఒక దేశం అభ్యంతరం చెప్పడం ద్వారా నిలిపివేయగలదు. ఈ వ్యవస్థను అప్పట్లో  శక్తివంత మైన దేశాలను సమతా స్థితిలో ఉంచేందుకు అవసరమైన రాజీగా సమర్థించారు. కానీ, నేడు అదే వ్యవస్థ ప్రపంచ న్యాయాన్ని అడ్డుకునే గోడగా మారింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సందర్భాన్ని చూసుకుంటే, ఒక స్వతంత్ర దేశంపై సైనిక దాడి జరగడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం స్పష్టమైన ఉల్లంఘన. కానీ, భద్రతా మండలిలో రష్యా వీటో హక్కుతో తనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్మానాలను అడ్డుకుంది. ఫలితంగా ఐరాస ప్రకటనలు చేసే సంస్థగా మిగిలిపోయింది.

అదే విధంగా ఇజ్రాయెల్ ఘర్షణలో అమెరికా తన మిత్రదేశాన్ని కాపాడేం దుకు వీటోని ఉపయోగించింది. ఫలితంగా ఐరాస మాటల్లో తీవ్రత ఉన్నా, చర్యల్లో బలహీనత కనిపించింది. గాజాలో వేలాది మంది నిరపరాధులు ప్రాణాలు కోల్పోతున్నా, ఐరాస సమర్థవంతంగా జోక్యం చేసుకోలేకపోయింది. ఈ లోపం ఎంత ప్రమాదకరమో స్పష్టమవుతోంది. ఇవి న్యాయం కంటే శక్తి పెద్దదనే కఠిన సత్యాన్ని చెబుతున్నాయి.

యుద్ధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఆశగా కనిపించాల్సిన ఐరాస చాలా సందర్భాల్లో అది దూరమైన సంస్థగా మాత్రమే కనిపిస్తోంది. గాజాలో ఒక తల్లి తన పిల్లలను కోల్పోయినప్పుడు, ఉక్రెయిన్‌లో ఒక యువకుడు తన భవిష్యత్తును కోల్పోయినప్పుడు ఐరాస సహాయమేదనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. దీంతో ఐరాస ఉన్నా, లేకపోయినా ‘మా జీవితాల్లో మార్పు ఏమిటి?’ అనే ప్రశ్న ఉదయిస్తున్నది. తీర్మానాలు తీసుకోవడం, సమావేశాలు నిర్వహిం చడం తప్ప యుద్ధ తీవ్రతల్లో మార్పు తీసుకురావడంలో అది విఫలమవుతోంది.

వీటో పవర్ ఐరాసని ఒక సమానత్వ వేదికగా కాకుండా, శక్తివంతమైన దేశాల ఆటస్థలంగా మార్చింది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తీవ్ర అసంతప్తిని కలిగిస్తోంది. భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్ వంటి దేశాలు తమ జనాభా, ఆర్థిక శక్తి, గ్లోబల్ పాత్రను బట్టి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వాన్ని కోరుతున్నాయి. కానీ, ఈ డిమాండ్ నెరవేరడం లేదు. ఐరాస ఒక స్వతంత్ర సంస్థ కాకపోవడమే అందుకు కారణం. మానవ హక్కుల పరిరక్షణలో కూడా ఐరాసపై ద్వంద్వ ప్రమాణాల విమర్శలు వస్తున్నాయి.

కొన్ని దేశాల విషయంలో కఠినంగా స్పందిస్తే, మరికొన్ని దేశాల విషయంలో మౌనం పాటించడం ఆ సంస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తోంది. ఇది సమన్యాయమనే ప్రాథమిక సూత్రానికి విరుద్ధం. ఐరాస బలహీనపడితే అంతర్జాతీయ చట్టాలపై విశ్వాసం తగ్గిపోతుంది. ఒక దేశం ఐరాస తీర్మానాలను పట్టించుకోకపోతే, ఇతర దేశాలు కూడా అదే మార్గాన్ని అనుసరించే ప్రమాదముంది. చిన్న దేశాలు భద్రత కోల్పోతాయి. పెద్ద దేశాలు తమ శక్తిని ఉపయోగించి చిన్న దేశాలను ఒత్తిడి చేయగల వు. మానవతా సంక్షోభాలు మరింత తీవ్రమవుతాయి. సమయానికి జోక్యం లేకపోతే, సమస్యలు విస్తరిస్తాయి.

ఈ నేపథ్యంలో ఇన్ని లోపాలున్న ఐరాస అవసరం ఇంకా ఉందా? లేదా కాలానుగుణంగా ఈ సంస్థను మూసివేయాలా? అన్న ప్రశ్న ఉత్పన్నమవ్వవచ్చు. కానీ, ప్రపంచ భవిష్యత్తు దృష్ట్యా ఓ అంతర్జాతీయ సంస్థ అవసరం తప్పనిసరి. అయితే, అది సమర్థవంతంగా ఉండాలి. తన లక్ష్యాలను సాధించలేకపోతే సంస్కరణలు తప్పనిసరి చేయాలి. ఐరాస లక్ష్యం పూర్తిగా విఫలమైందని చెప్పడం అర్ధసత్యమే.

కాంగో, లెబనాన్, సూడాన్ వంటి దేశాల్లో యుద్ధాలను నివారించడంలో ఇది సహాయపడింది. మహిళలు, పిల్లలు, శరణార్థుల హక్కుల రక్షణలో ప్రత్యేక సంస్థలు పనిచేస్తున్నాయి. పేదరిక నిర్మూలన, విద్య, ఆరోగ్య రంగాల్లో  అనేక కార్యక్రమాలు చేపట్టింది. యూఎన్‌డీపీ ద్వారా అభివద్ధి చెందుతున్న దేశాలకు సహాయం అందిస్తోంది. కొవిడ్ వంటి మహమ్మారుల సమయంలో మార్గదర్శకాలు, టీకా సహకారాన్ని ఐరాస అందిం చింది. ప్రపంచ వారసత్వ కట్టడాలను సంరక్షిస్తోంది.

విద్యా ప్రోత్సాహం, సాంస్కృతిక పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. మానవ సంస్కృతిని కాపాడుతూ భవిష్యత్తు తరాలకు అందిస్తోంది. భూమిని రక్షించడానికి ప్రపంచాన్ని ఒక్కచోట చేర్చి వాతావరణ మార్పులపై అవగాహన పెంచడం, ఒప్పందాలు చేయించడంలో  ఐరాస పాత్ర ఉంది. ఐరాస శాంతి కోసం నిర్మించినది. అది శక్తి కోసం యుద్ధభూమిగా మారకూడదు. తన ఆత్మను ఐరాస పునర్నిర్మించుకోవాలి. ఐరా స మానవాళి ఆశ. ఆ ఆశను నిలబెట్టుకోవడానికి ధైర్యమైన నిర్ణయాలు, నిజాయితీ గల సంస్కరణలు అవసరం.

ఐరాస ఆలోచనల్లో కూడా మార్పు అవసరం. కేవలం ప్రభుత్వాల వేదికగా కాకుం డా, ప్రజల వేదికగా ఇది మారాలి. యువత, పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు అంతర్జాతీయ నిర్ణయాలలో భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే యుద్ధాలు ప్రభుత్వాలు ప్రారంభిస్తాయి, కానీ వాటి ప్రభావం ప్రజలపై పడుతుంది. ఐరాస విఫలమైన కల కాదు కానీ, అది అసంపూర్ణంగా మిగిలిన కల. దాన్ని సాకారం చేయాలంటే, ధైర్యవంతమైన సంస్కరణలు అవసరం. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా సంస్థలు కూడా మారాలి. లేకపోతే, అవి చరిత్రలో ఒక అధ్యాయంగా మిగిలిపోతాయి.

శక్తి న్యాయాన్ని నియంత్రించే ప్రపంచం ప్రమాదకరం కానీ, శక్తిని న్యాయం నియంత్రించే ప్రపంచం శాంతికి మార్గమవుతుందనే సత్యాన్ని గుర్తించాల్సిన సమయం ఇది. వీటో వ్యవస్థపై పునరాలోచన చేసి మానవతా సంక్షోభాల విషయంలో దాన్ని పరిమితం చేయాలి. భద్రతా మండలిలో భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్ వంటి దేశాలకు స్థానం కల్పించడం ద్వారా ప్రతినిధిత్వాన్ని సమతుల్యం చేయా లి. ఐరాస నిర్ణయాలకు అమలు శక్తి పెరగాలి. సభ్య దేశాల సహకారంపై ఆధార పడకుండా స్వతంత్ర శాంతి దళం, వేగవంతమైన చర్యల వ్యవస్థ అవసరం. పారదర్శకత, బాధ్యతను పెంచాలి. ప్రతి నిర్ణయం, దాని వెనుక ఉన్న కారణాలు ప్రజలకు స్పష్టంగా తెలియాలి. ‘ప్రపంచం కోసం ప్రపంచం’ అనే భావన బలపడాలి.

వ్యాసకర్త సెల్: 8466827118

దుప్పటి మొగిలి