మణిపూర్‌లో మళ్లీ అగ్గి
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ మంటలంటుకున్నాయి. గుర్తుతెలియని దుండగులు జరిపిన బాంబు దాడిలో అభశుభం తెలి యని ఇద్దరు చిన్నారులు మరణించడం బాధాకరం. ఈ దాడిలో ఐదేండ్ల బాలుడు, ఆరు నెలల చిన్నారి మృతిచెందగా, వారి తల్లి తీవ్రగాయాలపాలయ్యారు. దీంతో మణిపూర్ లోయలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చిన్నారుల మృతిని నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులు రెండు ఆయిల్ ట్యాంకర్లు, ఒక ట్రక్‌ను తగులబెట్టారు.
పోలీసు అవుట్‌పోస్ట్‌కు నిప్పుపెట్టారు. ఈ ఆందోళనలు ఘటన జరిగిన బిష్ణుపూర్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాలకు వ్యాపించాయి. పరిస్థితులు మరోసారి అదుపు తప్పే ప్రమాదం ఉండటంతో కేంద్ర బలగాలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతిచెందగా, 19 మందికి గాయాలైనట్టు తెలుస్తున్నది. శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బిష్ణుపూర్ జిల్లాలో కర్ఫ్యూ విధించింది. దాంతో పాటు వదంతుల వ్యాప్తిని అరికట్టేందుకు బిష్ణుపూర్‌తోపాటు ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ, థౌబల్, కక్‌చింగ్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఇంటర్నెట్ షట్‌డౌన్ మూడు రోజుల పాటు కొనసాగనున్నట్టు మణిపూర్ ప్రభుత్వం తెలిపింది.
ఈ ఘటనను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖేమ్‌చంద్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని, నిందితులను వెంటనే గుర్తించి, చట్ట ప్రకారం కఠి నంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే, తాజా ఘటన నేపథ్యంలో మణిపూర్‌లో కుకీ, మైథేయి వర్గాల మధ్య మళ్లీ ఘర్షణలు తలెత్తుతాయేమోనన్న భయాందోళనలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడేండ్ల క్రితం దేశాన్ని కుదిపేసిన మణిపూర్ మంటలు కండ్లముందు కదలాడుతున్నాయి. మణిపూర్‌లోని కుకీ, మైథీ, నాగా వర్గాల మధ్య దశాబ్దాలుగా ఘర్షణలు జరుగుతున్నాయి.
మణిపూర్‌లో సుమారు 33 లక్షల జనాభా ఉండగా, సగానికి పైగా ఉన్న మైథీలు ఇంఫాల్ లోయలో ఉంటున్నారు. 43 శాతానికి పైగా ఉ న్న కుకీలు, నాగాలు కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అయితే, తమకు ట్రైబ ల్ హోదా ఇవ్వాలని మైథీలు డిమాండ్ చేయడం, బీరేన్‌సింగ్ నేతృత్వంలోని నాటి బీజేసీ సర్కార్ వారికి మద్దతిస్తున్నదన్న ఆరోపణలు రావడంతో కుకీలు 2023 మే 3న ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలు క్రమంగా ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీశాయి. ఏడాదికి పైగా జరిగిన ఈ ఆందోళనల్లో రెండు వర్గాలకు చెందిన సుమారు0 140 మంది మరణించగా, 400 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. 60 వేల మంది నిరాశ్రయులయ్యారు.
ఓ వర్గానికి చెందిన మహిళలను వివస్త్రలను చేసి నడి వీధుల్లో ఊరే గించడంపై అప్పట్లో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈశాన్య రాష్ట్రం మంటల్లో తగులబడిపోతున్నా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడం, రెండేండ్ల వరకు ప్రధాని మోదీ ఆ రాష్ట్రం వైపు కనీసం కన్నెత్తి చూడ కపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. శాంతిభద్రతలను అదుపు చేయడం లో పూర్తిగా విఫలమైన బీరేన్ సింగ్ చివరికి 2025 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఏడాది తర్వాత 2026 ఫిబ్రవరిలో ఖేమ్‌చంద్ సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, రెండు నెలలు గడవకముందే మళ్లీ అగ్గిరాజుకుంది. గత అనుభవాల దృష్ట్యా ఈ మంటలను ఆదిలోనే అంతమొందించాల్సిన అవసరం ఉన్నదని చెప్పక తప్పదు.




