30 July, 2026 | 1:09 AM

ప్రజాస్వామ్యానికి ఓటే మూలస్తంభం

30-07-2026 12:09 AM
  1. అర్హులందరినీ ఓటరుగా నమోదు చేయిస్తాం
  2. సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం
  3. పారదర్శకంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక
  4. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులకు కీలక బాధ్యతలు 
  5. ఢిల్లీలో మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి) : భారత ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి పౌరుడి ఓటు హక్కే మూలస్తంభమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.

బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో ప్రధానంగా మూడు అంశాలపై విస్తృత చర్చ జరిగిందన్నారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు.

సర్ ప్రక్రియపై రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందని, పార్టీ నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు)  సమర్థవంతంగా పనిచేస్తున్నారని, వారి పనితీరును ఏఐసీసీ సైతం సమీక్షించి అభినందించిందని భట్టి చెప్పారు. మిగిలిన ఓటరు నమోదు ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాలని ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ సూచించారని పేర్కొన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ క్యాడర్, సంస్థాగత వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికీ చేర్చేందుకు సమావేశంలో ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు డిప్యూటీ సీఎం  వివరించారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును వేగవంతం చేయడంతో పాటు, ఎమ్మెల్సీ బరిలో నిలిచే ఆశావహుల ఎంపిక పారదర్శకంగా జరిగేలా చూడాలని నిర్ణయించామని వెల్లడించారు.

ఈ ప్రక్రియలో భాగంగా ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. మంత్రులు తమ జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు (డీసీసీ), ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతో చర్చించి.. ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను పార్టీ అధిష్టానానికి సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.  

దురుద్దేశంతో ‘సర్’ ప్రక్రియ: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్

ఈసారి సర్’ ప్రక్రియ దురుద్దేశంతో జరుగుతుందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. అర్హుల ఓట్లు పోకుండా పార్టీ ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, తెలంగాణ వ్యాప్తంగా 36 వేల మంది బీఎల్‌ఏలను పార్టీ పరంగా నియమించినట్లు చెప్పారు. 50 నుంచి 60 శాతం సర్ ప్రక్రియ పూర్తయిందని, రెండు, మూడు రోజుల్లో వందశాతం పూర్తవుతుందని ఆయన వివరించారు.