8 May, 2026 | 2:00 AM

ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి

08-05-2026 12:21 AM

రాష్ట్ర ఎన్నికల సంఘం అడిషనల్ సీఈఓ వాసం వెంకటేశ్వర్ రెడ్డి 

సంగారెడ్డి, మే 7 (విజయక్రాంతి): భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ కార్యక్రమాన్ని సమర్థవంతంగా, వేగవంతంగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అడిషనల్ సిఈఓ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సంగారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఎస్ ఐ ఆర్ నమోదు ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఈఆర్‌ఓ రాజేందర్, ఏడు మంది ఏఈఆర్‌ఓలు, బిఎల్వో సూపర్వైజర్లు, బూత్ లెవల్ అధికారులు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు సీఈఓ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ 2025 ఓటరు జాబితాలోని అర్హులైన ప్రతి ఓటరును 2002 ఓటరు జాబితాతో అనుసంధానం చేసే ప్రక్రియను కచ్చితంగా పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మ్యాపింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటం గమనించామని, బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించి వేగవంతంగా మ్యాపింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు.

మ్యాపింగ్ ప్రక్రియలో రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్ల సహకారం తీసుకోవాలని, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లతో  సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి అర్హత గల ఓటరు తమ వివరాలను మ్యాపింగ్ చేయించుకునేలా సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని పేర్కొంటూ, సంబంధిత ఏఈఆర్‌ఓలు యాక్షన్ ప్లాన్ ప్రకారం రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఈఆర్వో, ఏఈఆర్వోలు, బీఎల్వో సూపర్వైజర్లు, బీఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.