కట్టిన గోడ, మిగిలిన జాగ ఖతం!
వర్షానికి కూలిన కాలేజీ కాంపౌండ్ వాల్
వాస్తు కింద వదిలేసిన ఎకరం అన్యాక్రాంతం
నాగర్‌కర్నూల్ సైన్స్ డిగ్రీ కళాశాల దౌర్భాగ్యం
నాగర్‌కర్నూల్, జూన్ 6 (విజయక్రాంతి) : కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఏడాది క్రితమే నిర్మించిన కళాశాల ప్రహరీ గోడ చిన్నపాటి వర్షానికే నేలకూలింది. గురువారం తెలవారుజామున కురిసిన మోస్తారు వర్షానికి నాగర్‌కర్నూల్ పట్టణం నెల్లికొండ చౌరస్తాలోని సైన్స్ డిగ్రీ కళాశాల కాంపౌండ్ వాల్ నేలమట్టమైంది. కాలేజీకి మొత్తం 5.10 ఎకరాల భూమి ఉంది. నాలుగు ఎకరాల చుట్టూ ప్రహరీ నిర్మించారు. మిగతా ఎకరం స్థలాన్ని వాస్తుదోషం పేరిట వదిలేశారు. ఇప్పుడది రియల్‌ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిందని పట్టణవాసులు ఆరోపి స్తున్నారు.
ఇక ప్రహరీ గోడ పనులు నాసిరకంగా చేయడం వల్లే కొద్దిపాటి వర్షానికి తట్టుకోలేక కూలిపోయిందని మండిపడుతున్నారు. రెండు నెలల క్రితమే బిల్లులు మంజూరయ్యాయని, నాణ్యత పరిశీలించకుండానే విడుదల చేశారనే అనుమానాలు కలుగుతున్నాయి. కోట్లు విలువజేసే మరో ఎకరం జాగను కూడా ఎందుచేత వదిలేసారోననే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికైనా కళాశాలకు చెందిన ఎకరం జాగను తిరిగి స్వాధీనం చేసుకోవడంతోపాటు కాంపౌండ్‌వాల్ నాసిరకంగా నిర్మిం చిన కా్రంటాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






