17 June, 2026 | 2:16 AM

లెబనాన్‌పై దాడులు ఆగితేనే యుద్ధం ముగిసినట్టు!

17-06-2026 01:22 AM

ఇజ్రాయెల్ దురాక్రమణ ఆపాల్సిందే

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ 

అమెరికా శాంతి ఒప్పందంపై వ్యాఖ్యలు 

టెహ్రాన్, జూన్ 16: లెబనాన్‌పై దాడులు ఆగితేనే యుద్ధం ముగిసినట్టు అవుతుందని, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దురాక్మరణ ఆపాల్సిందేనని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తేల్చి చెప్పారు. మంగళవారం విదేశీ దౌత్యవేత్తలతో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక బ్రీఫింగ్ సమావేశంలో అమెరికా. శాంతి ఒప్పందంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ ఆక్రమణ పూర్తిగా ముగిసిపోతేనే యుద్ధం ముగిసినట్టని అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు.

ఈ అవగాహనా ఒప్పందంలో రెండు పక్షాలు ఉన్నాయని ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఉంటే, రెండో వైపు ఇరాన్, హెజ్బుల్లా ఉన్నాయని అరాగ్చీ నొక్కి చెప్పారు. లెబనాన్‌తో సహా అన్ని సరిహద్దుల్లో యుద్ధానికి తక్షణ, శాశ్వత ముగింపు పలకడమే ఈ ఒప్పంద ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అయితే, దక్షిణ లెబనాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ ఇంకా ఆక్రమణలను కొనసాగించడం ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించడమే అవుతుందని ఆయన హెచ్చరించారు.

భవిష్యత్తులో అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు రెండు ప్రత్యేక దశల్లో జరుగుతాయని వెల్లడించారు. యుద్ధం తర్వాత తలెత్తే తక్షణ ఆందోళనలపైనే ఇందులో దృష్టి పెడతామన్నారు. వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి పరిస్థితి, అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనం ఎత్తివేత, దాడుల వల్ల దెబ్బతిన్న ఇరాన్ మౌలిక సదుపాయాల పునర్నిర్మాణ ప్రయత్నాలపై మొదటి దశలో చర్చిస్తామన్నారు.

ఇరాన్ మౌలిక సదుపాయాలపై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడుల వల్ల భారీ నష్టం వాటిల్లిందని గుర్తు చేశారు. ఈ దాడుల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన పునర్నిర్మాణ ప్రయత్నాలు కూడా మొదటి దశలోనే ఉంటాయని ఆయన తెలిపారు. అత్యంత సున్నితమైన అంశాలైన ఇరాన్ అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షల ఎత్తివేత వంటి సవాళ్లను మొదటి దశలో కాకుండా, రెండో దశ చర్చల్లోనే ప్రస్తావిస్తామని, రాబోయే రోజుల్లో కుదిరే తుది సమగ్ర ఒప్పందం ద్వారానే వీటికి పూర్తి పరిష్కారం లభిస్తుందని అరాగ్చీ స్పష్టం చేశారు.