తెగ కొనేస్తున్న యూత్
లగ్జరీ కార్లు, ఫోన్లు భారీగా కొంటున్న యువతరం
సరాసరి ఐదేళ్లు తక్కువ వయసులోనే కొనుగోళ్లు
70 శాతం ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేస్తున్న యూత్
భారత్‌లో ఐదేళ్లుగా మారుతున్న ట్రెండ్..
న్యూఢిల్లీ, మే 20: స్మార్ట్ ఫోన్లు, విలువైన కార్లు, పెద్ద స్క్రీన్ టీవీలు కొనాలంటే ఒకప్పుడు ముందూ వెనుక ఆలోచించే వాళ్లు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఎందుకంటే యూత్ అభిరుచి పూర్తిగా మారిపోయింది. పైగా వీటిని కొనాలంటే దాదాపు 40 ఏళ్లు వచ్చాక సెటిలయ్యాక లెక్కలు చూసుకుని కొనుగోలు చేస్తుండేవారు. హై ఎండ్ కార్లు, స్మార్ట్ ఫోన్లు, ఐఫోన్లు, పెద్ద పెద స్క్రీన్ల టీవీలు కొంటున్న వారిలో ఎక్కువగా యువతే ఉందని తాజా లెక్కలు చెబుతున్నాయి. గతంలో కొనే వారితో పోలిస్తే ఇప్పుడు 5 నుంచి 7 ఏళ్ల తక్కువ వయసులోనే వీటిని కొనేస్తున్నారు.
మారుతీ సుజికీ, హ్యూండాయ్, మెర్సిడెస్ బెంజ్ కార్ల కంపెనీలు చెబుతున్న లెక్కల ప్రకారం ఒకప్పుడు లగ్జరీ కార్లు కొనేవారి వయసు అటు ఇటుగా 40 ఏళ్లు ఉంటే.. ఆ వయసు 2018 నుంచి 2023 మధ్యలో దాదాపు 30 ఏళ్లకు పడిపోయిందని చెబుతున్నారు. అంటే 30 నుంచి 35 ఏళ్ల లోపే లగ్జరీ కార్లు కొనేస్తున్నారు. ఇక భారత్‌లో 70 శాతం ఎలక్ట్రిక్ కార్లను 20 నుంచి 30 ఏళ్ల వయసులోనే కొనేస్తున్నారట. ఇక ఐఫోన్లను గతంలో దాదాపు 33 ఏళ్ల వయసులో కొనేవారట. కానీ ఇప్పుడు ఆ వయసు 28 ఏళ్లకు తగ్గింది. ఇక 55 అంగుళాలు అంతకుమించిన సైజు టీవీలను ఎక్కువగా 29 ఏళ్ల వయసు వారే కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు ఇలాంటి టీవీలను 35 ఏళ్లు వచ్చాకే కొనుగోలు చేసేవారట.
ధరలు పెరిగినా అదే ట్రెండ్..
సాధారణంగా గత ఐదేళ్లలో కార్లు, ఫోన్ల ధరలు పెరిగాయి. కానీ కొనేవారి సరాసరి వయసు తగ్గిందని తయారీదారులు చెబుతున్నారు. ‘గత ఐదేళ్లుగా వాహనాల ధరలు పెరిగాయి. కానీ వాటిని కొనేవారి సరాసరి వయసు మాత్రం తగ్గింది. గతంలో 38 ఏళ్ల వయసున్న వారు ఎక్కువగా వాహనాలు కొనేవారు. కానీ ఐదేళ్లలో సరాసరిగా ఐదు సంవత్సరాలు తగ్గింది. ప్రస్తుతం ఉన్న వినయోగదారుల అభిరుచి మారింది. అన్ని సదుపాయాలు కోరుకుంటున్నారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, సేఫ్టీ కోసం ఎక్కువ డబ్బు చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు’ అని హ్యూండాయ్ మోటార్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ వివరించారు.
కారణాలేంటి..?
తక్కువ వయసులోనే లగ్జరీ కార్లు, స్మార్ట్ ఫోన్లు, టీవీలు కొనుగోలు చేయడానికి కారణాలేంటని విశ్లేషిస్తే.. తక్కువ వయసులోనే పెద్ద ప్యాకేజీలతో ఉద్యోగాలు దొరకడం, ఆకర్షణీయమైన ప్యాకేజీలతో కంపెనీలు మారడం వల్ల వారి కొనుగోలు సామర్థ్యం ఒక్కసారిగా పెరిగింది. ఇక కరోనా తర్వాత ఉత్సాహంగా పనిచేసే యువతీయువకులను కంపెనీలు ఎక్కువ ప్యాకేజీతో హైర్ చేసుకున్నాయి. అంతేకాకుండా వారి తల్లిదండ్రులు కూడా అప్పటికే ఇల్లు, సొంత వ్యాపారం చేస్తుండటం.. పెద్దగా అప్పులు లేకపోవడం కూడా వారు లగ్జరీ వస్తువులు కొనుగోలు చేస్తున్నారు.
చాలా మంది తొలి ఉద్యోగం రాగానే పది లక్షలకు పైగా ధర ఉన్న కార్లు లేదా లక్ష పైగా ఉన్న స్మార్ట్ ఫోన్లు కొంటున్నారని చెబుతున్నారు. వైట్ కాలర్ ఉద్యోగాలు చేస్తున్న వారిలో దాదాపు 20 30 ఏళ్ల వయసు ఉన్న వారు ఎక్కువగా లగ్జరీ వస్తువులు కొనుగోలు చేస్తున్నారని హానర్ ఇండియా సీఈవో మాధవ్ సేత్ వివరించారు. వైట్ కాలర్ ఉద్యోగాలు పెరగడం, టూ, త్రీ టైర్ నగరాల్లో కూడా నో కాస్ట్ ఈఎంఐ అందుబాటులోకి రావడం వల్ల వీటిని కొనుగోలు చేసే వారి వయసు కూడా బాగా తగ్గిందని చెప్పొచ్చు.
బెంజ్ కార్ల కొనుగోలులోనూ ఇంతే..
ఇక జర్మనీ లగ్జరీ మెర్సిడెస్ బెంజ్ ఎస్ కారును భారత్‌లో సరాసరిగా 38 ఏళ్లకే కొనేస్తున్నారట. ఆరేళ్ల కింద సరాసరి వయసు 41 ఏళ్లు ఉండేది. ఇక ఇటీవల బెంజ్ కార్లు కొంటున్న ఉద్యోగుల సంఖ్య కూడా భారీగానే పెరిగిందని చెబుతున్నారు. ఎర్టిగా వంటి మల్టీ పర్పస్‌కార్లను కొనేవారి సరాసరి వయసు 40 నుంచి 37కు పడిపోయింది. ఇక స్విఫ్ట్, బలెనో వంటి కార్లను కొనే వారి సరాసరి వయసు 38 నుంచి 36 ఏళ్లకు తగ్గింది. దేశంలో యువకుల జనాభా ఎక్కువగా ఉంటుండటం, వైట్ కాలర్ ఉద్యోగాలు పెరగడం వల్లే ఈ ట్రెండ్ నడుస్తోంది.
ఐ ఫోన్
౨౮ నుంచి ౩౦ ఏళ్లకే
(గతంలో ౩౩ ఏళ్లు)
హైఎండ్ కార్లు
సరాసరి ౩౮ ఏళ్లకే
కార్లు కొనేస్తున్న యూత్
౭౦ శాతం ఎలక్ట్రిక్ కార్లు వాళ్లవే..
వైట్ కాలర్ జాబ్స్, ఎక్కువ ప్యాకేజీలు, ఈఎంఐ ఆప్షన్స్‌తో భారీగా ఖర్చు పెడుతున్న యువత
టీవీలు
౨౯ ఏళ్లకే కొనేస్తున్న యువత
(గతంలో ౩౫ ఏళ్లకు కొనేవారు )






