మోదీలో ఏ మార్పు లేదు
ఎన్నికల ఫలితాలతోనూ ఆయన మారలేదు
ఇప్పటికీ బీజేపీ ఘర్షణలకే ప్రాధాన్యమిస్తోంది
ఎన్డీయే సర్కారుపై కాంగ్రెస్ సోనియాగాంధీ ఆగ్రహం
ఎమర్జెన్సీలో మమ్మల్ని వేధించలేదు: లాలూప్రసాద్
ఎమర్జెన్సీపై వ్యాఖ్యలు స్పీకర్ స్థాయికి తగవు: శరద్‌పవార్
న్యూఢిల్లీ, జూన్ 29: పార్లమెంట్ సమావేశాల్లో ఎమర్జెన్సీపై లోక్‌సభలో స్పీకర్, రాష్ట్రపతి ప్రస్తావించడంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ మండిపడ్డారు. రాజ్యాంగంపై దాడి నుంచి దృష్టి మరల్చేందుకే ఎప్పుడో జరిగిన ఎమర్జెన్సీ అంశాన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో బలహీనపడినా దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని, దేశంలో ఆ పార్టీ స్థానమేంటో ఆయన ఇంకా అవగాహనకు రాలేదని ది హిందూ పత్రికకు రాసిన సంపాదకీయంలో సోనియా పేర్కొన్నారు.
ప్రధా నమంత్రి ఏం మారలేదని భావిస్తున్నారు. ఆయన ప్రజాభిప్రాయం గురించి బోధిస్తారు. కానీ, ప్రజల మధ్య ఘర్షణకే ప్రాధాన్యమిస్తారు. 18వ లోక్‌సభ సమావేశాలు దురదృష్టవశాత్తు అంత ఆశాజనకంగా లేవు. ప్రజల్లో వచ్చిన మార్పును చూస్తామనే ఆశ పూర్తిగా దెబ్బతింది అని మండిపడ్డారు. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలనే ఒక డిమాండ్ ఉందని, కానీ, 2014లో ఈ పదవికి ఎన్డీయే మిత్రపక్షమైన అన్నాడీఎంకే ఎంపీ తంబి దురైకి ఇచ్చారని సోని యా గుర్తు చేశారు. 2019లో ఈ పదవిని ఖాళీ ఉంచారని, ప్రస్తుతం బీజేపీ ఎంపీనే డిప్యూటీ స్పీకర్ చేశారని చెప్పారు.
ఎమర్జెన్సీ అంశం ఓ పావు
ప్రస్తుతం రాజ్యాంగంపై దాడిని పక్కదోవ పట్టించేందుకు ఎమర్జెన్సీపై ప్రస్తావనను బీజీపీ తీసుకొస్తోందని సోనియా ఆరోపించారు. స్పీకర్ కూడా ఇలాంటి రాజకీయ అంశాన్ని ప్రస్తావించడం ఆమోదయోగ్యం కాదని ఆమె తెలిపారు. 1977లోనే ఎమర్జెన్సీపై ప్రజలు నిర్ణయాత్మక తీర్పునిచ్చారని తెలిపారు. మూడేళ్లలోనే తిరిగి అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిందని గుర్తు చేశారు. అదీ కూడా మోదీ ఇప్పుడు సాధించలేని మెజారిటీని పొందినట్లు తెలిపారు.
ఇదంతా చరిత్ర అని, దాన్ని ఎవరూ తుడిచేయలేరని సోని యా ఉద్ఘాటించారు. మరోవైపు నీట్ పేపర్ లీకేజీపై ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని సోనియా తప్పుబట్టారు. ఈ స్కాం లక్షలాది యువత జీవితాలను అయోమయంలోకి నెట్టిందని ఆరోపించారు. పరీక్షా పే చర్చ అంటూ హడావుడి చేసే ప్రధాని.. ఇలాంటి తీవ్రమైన అంశాల్లో మౌనంగా ఉండటం తగదని హితవు పలికారు. అంతేకాకుండా మణిపూర్‌లో తీవ్రమైన హింస చెలరేగినా మోదీ అక్కడికి ఒక్కసారి కూడా వెళ్లలేదని మండిపడ్డారు. కుకీ, మైతీ వర్గాల మధ్య ఘర్షణలతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, వేలాది మంది నిరాశ్రయులు అయ్యారని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ప్రధానికి సమయం దొరకలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమర్జెన్సీలో మమ్మల్ని వేధించలేదు
అత్యవసర స్థితిపై దేశంలో చర్చ నడుస్తుండగా బీహార్ మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి లాలూప్రసాద్‌యాదవ్ స్పందించారు. ఎమర్జెన్సీ సమయంలో తమను ఇందిరా జైలులో పెట్టినా మోదీ ప్రభుత్వం మాదిరిగా వేధించలేదని వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినప్పుడు జయప్రకాశ్ నారాయణ్ ఏర్పాటు చేసిన కమిటీకి కన్వీనర్‌గా పనిచేశా. అప్పుడు మీసా చట్టం కింద మమ్మల్ని జైలులో పెట్టారు. 15 నెలలు జైలులో ఉన్నా. ఈరోజు ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్న మోదీ, జేపీ నడ్డా, ఇతర కేంద్రమంత్రుల గురించి మేం వినలేదు. ఇందిర ఎంతో మందిని జైలులో వేసినా ఎవరినీ వేధించలేదు. ఆమె కానీ, మంత్రులు కానీ మమ్మల్ని దేశ వ్యతిరేకులు అని అనలేదు. మన ప్రజాస్వామ్యంపై ఎమర్జెన్సీ ఒక మరకలాంటిదే. కానీ, 2024లో విపక్షాలను గౌరవించని వారిని కూడా ఎవరూ మరిచిపోకూడదు అని లాలూ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
స్పీకర్ నోట అలాంటి వ్యాఖ్యలు తగవు
ఎమర్జెన్సీపై లోక్‌సభ స్పీకర్ వ్యాఖ్యలు ఆ స్థాయికి తగినట్లు లేవని ఎన్సీపీ (ఎస్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ పేర్కొన్నారు. ముంబైలో మీడియా సమావేశంలో శనివారం మాట్లాడుతూ.. లోక్‌సభ స్పీకర్ పదవిలో ఉన్న ఓం బిర్లా సందర్భం లేకుండా ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించారని ఆరోపించారు. ఇది ఆయన స్థాయికి ఏమాత్రం తగదని విమర్శించారు. ఆ చీకటి అధ్యాయం ముగిసి 50 ఏళ్లు గడిచిందని, ఇప్పుడు ఆ అంశాన్ని ఎందుకు తెరపైకి తీసుకొస్తున్నారని ప్రశ్నించారు.






