నెహ్రూ పంచశీల ప్రశంసనీయం
- ఆయన విదేశాంగ విధానాలు గొప్పవి
- ప్రపంచ విధానంలో మేము వాటిని పాటిస్తాం
- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఉద్ఘాటన
బీజింగ్ (చైనా), జూన్ 29: భారత్, చైనా సంబంధాల్లో పంచశీల ఒప్పందం ఎంతో మెరుగైందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కొనియాడారు. భారత మాజీ ప్రధాని జవహార్‌లాల్‌నెహ్రూ విధానాలు గొప్పవని ప్రశంసించారు. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌తో ప్రతిష్ఠంభన కొనసాగుతున్న వేళ జిన్‌పింగ్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రపంచంలో నెలకొన్న సంఘర్షణలకు ముగింపు పలకడానికి పంచశీల సూత్రాలు మెరుగ్గా పని చేస్తాయని సూచించారు. రెండు దేశాల మధ్య పంచశీల ఒప్పం దం జరిగి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిన్‌పింగ్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఒప్పందం చారిత్రక అవసరం. అందులోని ఐదు సూత్రాలు శాంతి, అభివృద్ధిని ప్రతిబింబిస్తూ వాటిని సాధిస్తాయి. భారత్, మయన్మార్‌తో చైనా సంయుక్త ప్రకటనల్లోనూ ఈ సూత్రాలను మా గత లీడర్‌షిప్ చేర్చింది. దేశాల మధ్య దృఢమైన సంబంధాలకు వీటిని ప్రాథమిక నిబంధనలుగా చేర్చాలని సంయుక్తంగా పిలుపునిచ్చింది అని పంచశీల ప్రాముఖ్యాన్ని జిన్‌పింగ్ కొనియాడారు.
సూత్రాలను పాటిస్తాం..
పంచశీల ఒప్పందం ఆసియాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని జిన్‌పింగ్ గుర్తుచేశారు. 60వ దశకంలో పుట్టిన అలీనోద్యమానికి ఈ 5 సూత్రాలు మార్గదర్శ కంగా నిలిచాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ చట్టాల కు ఈ సూత్రాలు ప్రామాణికంగా ఉంటాయన్నారు. ప్రపంచ భద్రత కోసం తాము తీసుకొస్తున్న గ్లోబల్ సెక్యురిటీ ఇనిషియేటివ్‌లోనూ ఈ విధానాలను అనుసరించాలని భావిస్తున్నట్లు జిన్‌పింగ్ స్పష్టం చేశారు.
పంచశీల ఒప్పందం
సరిహద్దు దేశాలకు సంబంధించి అంతరంగిక వ్యవహారాల్లో జోక్యాన్ని నివారించేందుకు భారత్, చైనా మధ్య 1954లో ఒప్పందం కుదిరింది. అప్పటి ప్రధానులు జవహార్‌లాల్‌నెహ్రూ, చౌఎన్‌లై దీనిపై సంతకాలు సంతకాలు చేశారు. ఆ తర్వాత 1960లో అలీనోద్యమంతో ఈ విధానాలు ప్రపంచ వ్యాప్తంగా విశేష గుర్తింపు పొందాయి.
పంచశీలలోని అంశాలు
1. సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను పరస్పరం గౌరవించుకోవడం.
2. ఇతర దేశాల అంతర్గత అంశాల్లో జోక్యం చేసుకోకపోవడం.
3. దాడులు, ఆక్రమణలకు దిగకపోవడం. వివాదాలను పరస్పర అవగాహ నతో పరిష్కరించుకోవాలి.
4. అంతర్జాతీయ సంబంధాల్లో పరస్పర గౌరవం, సహకారానికి కృషి చేయాలి.
5. పొరుగు దేశాలతో శాంతియుత జీవనాన్ని ప్రోత్సహించడం.






