8 May, 2026 | 4:30 PM

దేశంలో మహిళలకు భద్రత లేదు

31-08-2024 01:16 AM
  1. ప్రజలు మార్పు కోరుకుంటున్నరు 
  2. వయనాడ్ నుంచి ప్రియాంక పోటీ 
  3. కాంగ్రెస్‌లో పవర్ సెంటర్‌ను భవిష్యత్ నిర్ణయిస్తుంది 
  4. ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్‌వాద్రా వెల్లడి 
  5. రెండు రోజుల పర్యటనకు హైదరాబాద్‌కు

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): దేశంలో మహిళలకు భద్రత లేదని, ఇప్పుడు భద్రత అనేది ప్రధాన సమస్యగా మారిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. తన భార్య, కూతురు కూడా మహిళలకు భద్రత విషయంలో అప్పుడప్పుడు ఆందోళన చెందుతుంటారని ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాబర్ట్ వాద్రా మాట్లాడారు. అంతకుముందు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లిని దర్శించుకున్నారు. భూమిపై నడవాలంటే తన భార్య, కూతురుతో పాటు దేశంలోని మహిళలందరూ భద్రంగా ఫీల్ అయ్యే రోజులు రావాలన్నారు. మహిళలు భద్రంగా ఉండాలంటే వారితో ఎలా ప్రవర్తించాలో ఇంట్లోనే నేర్పించాలని సూచించారు.

ఇదే అంశంపై రాహుల్‌గాంధీ, తాను మాట్లాడుతున్నామని ఆయన పేర్కొన్నారు. దేశంలోని సమస్యలను తనతో పాటు రాహుల్‌గాంధీ కూడా ఒకే కోణంలో చూస్తున్నామని తెలిపారు. దేశంలోని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అది మరో ఐదేళ్ల తర్వాత ప్రజలు మార్పు చూస్తారని రాబార్ట్ వాద్రా పేర్కొన్నారు. తాను ఆధ్యాత్మిక భావనతోనే హైదరాబాద్‌కు వచ్చినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తాను పవర్ సెంటర్ కావడం భవిష్యత్తు నిర్ణయింస్తుందన్నారు.

ప్రియాంక గాంధీ కేరళలోని వయనాడ్ ఎంపీగా పోటీ చేయబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాబార్ట్ వాద్రా శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చారు. తనకిష్టమైన మందిరాలను, మసీదులను సందర్శిస్తానని తెలిపారు. శుక్రవారం రాత్రి ఫలక్‌నుమా ఫ్యాలెస్‌లో ఆయన బస చేశారు. రాబర్ట్ వాద్రాను కాంగ్రెస్ పార్టీ నేతలెవ్వరూ మాత్రం కలవలేదు. ఆయన పూర్తిగా ఆధ్యాత్మికంగా దేవాలయాలు, మసీదులను సందర్శించడానికే వచ్చినట్లు చెబుతున్నారు.