ఫిరాయింపుదార్ల సభ్యత్వాల్ని రద్దు చేయండి
హైకోర్టులో కేఏ పాల్ పిల్ దాఖలు
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): పార్టీ ఫిరాయింపుదారుల సభ్యత్వాలను రద్దు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషన్‌కు నంబరు కేటాయించడంలో రిజిస్ట్రీ అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై సీజే జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ పాల్ వాదనలు వినిపిస్తూ ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరోపార్టీ తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారన్నారని ఆరోపించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా వీరిపై అనర్హత వేటు వేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. అంతేగాకుండా పార్టీ మారిన వారు చట్టసభల్లో అడుగుపెట్టకుండా ఆదేశాలివ్వాలని, వారికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలన్నీ రద్దు చేయాలని కోరారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఫిరాయిం పులకు సంబంధించి సింగిల్ జడ్జి వద్ద పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా ఇక్కడ మళ్లీ పిటిషన్లు ఎందుకని ప్రశ్నించగా పాల్ సమాధానమిస్తూ అవి రాజకీయ ప్రయోజనాలతో దాఖలయ్యాయని, ఇది ప్రజాప్రయోజనాలకు సంబంధించినదన్నారు. ఇదే విషయాన్ని అఫిడ విట్ రూపంలో సమర్పిస్తే పరిశీలిస్తామంటూ విచారణను సెప్టెంబరు 1వ తేదీకి వాయిదా వేసింది.






