8 May, 2026 | 3:28 PM

వైద్య సిబ్బందికి భద్రత కల్పించాలె

31-08-2024 01:25 AM
  1. జాతీయ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు 
  2. డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి జూనియర్ వైద్యుల వినతి

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పనిచేసే వైద్య సిబ్బందికి పనిచేసే చోట భద్రత కల్పించాలని జూనియర్ డాక్టర్లు కోరారు. కోల్‌కతా ఘటన నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది భద్రతపై వేసిన జాతీయస్థాయి కమిటీలో సభ్యుడైన డా. డి. నాగేశ్వర్ రెడ్డిని శుక్రవారం జూనియర్ డాక్టర్లు కలిసి వినతిపత్రం సమర్పించారు.  ఈమేరకు నివేదిక ద్వారా సుప్రీంకోర్టుకు విన్నవించాలని కోరారు. వర్క్ స్పేస్‌లో ప్రస్తుతం ఉన్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకుపోయారు. జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు ఎదుర్కుంటున్న సమస్యలను ఆయనకు వివరించారు.

కోల్‌కతా తరహా ఘటనలు జరుగకుండా ప్రత్యేక భద్రత చర్యలు తీసుకునాల్సిన ఆవశ్యకతను ఆయనకు వివరించారు. రాష్ర్టంలో తాము ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అందరి నుంచి వచ్చిన వినతులతో కూడిన నివేదికను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ, జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ)కి సమర్పించేలా నేషనల్ టాస్క్ ఫోర్స్ పనిచేస్తోందని జూనియర్ డాక్టర్లకు డా. నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. వైద్యుల భద్రతే ప్రధానాంశమని అన్నారు.