3 July, 2026 | 1:35 PM

చౌటుప్పల్ ట్రినిటీ స్కూల్ వద్ద ఉద్రిక్తత

03-07-2026 01:02 PM

అక్రమంగా స్టేషనరీ అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన

చౌటుప్పల్,జూలై 03(విజయక్రాంతి): ప్రైవేటు పాఠశాలల్లో స్టేషనరీ అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్రంగా నష్టపరిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని ట్రినిటీ పాఠశాల వద్ద అక్రమంగా స్టేషనరీ అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు.

అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు అక్రమంగా స్టేషనరీ అమ్ముతున్నారని నాయకులు ఆరోపించారు.స్కూల్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్కూల్ యాజమాన్యంతో పోలీసులు కుమ్మక్కై విద్యార్థులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కొద్దిసేపు ట్రినిటీ స్కూల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.అధికఫీజులు వసూలు చేస్తున్న ట్రినిటీ పాఠశాల పై చర్యలు తీసుకొని పాఠశాలను సీజ్ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని పరిస్థితిని అదుపు చేశారు.