2 March, 2026 | 1:57 PM

చక్కటి డెస్టినేషన్స్ ఇవే!

23-09-2024 12:00 AM

తీర్థయాత్ర :

కాలం మన చేతిలో ఉండదు.. అనునిత్యం కాలంతో పాటు వయసు కూడా మైనంలా కరిగిపోతుంటది. అలా కరిగిపోయే కాలాన్ని అదిమిపట్టుకొని.. ముందుకు సాగడమే జీవితం. వయసుకు మనసుతో సంబంధం ఉండదని అందరికి తెలుసు. వయసు పైబడిందని దిగులు చెందకుండా.. మనసుకు నచ్చిన పుణ్యక్షేత్రాలను ఓ సారి సందర్శించండి. భక్తిమయంతో సాగే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. దాని కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన దేశంలోనే తూర్పున పూరీ, ఉత్తరాన కాశీ, దక్షిణాన రామేశ్వర క్షేత్రాలు ఉన్నాయి. తీర్థయాత్రలకు వెళ్లే వారికి చక్కటి చిరునామాలు ఈ పుణ్యక్షేత్రాలు.. 

జీవితంలో ఒక్కసరైనా చూడదగ్గ ప్రదేశం కాశీ. ఒక శ్లోకంలో శివుడు ఇలా అంటాడు. “ముల్లోకాలు నాకు నివాసమే. అందులో కాశీ క్షేత్రం నా మందిరం” అని. ఋగ్వేదంలో ఈ నగరాన్ని కాశీ, జ్యోతి స్థానం అని పిలుస్తారు. స్కాంద పురాణంలో కాశీఖండంలో ఈ నగర మహాత్యం గురించి వర్ణన కనిపిస్తుంది. అందుకే  ఈ క్షేత్రాన్ని మోక్షానికి మార్గం అంటుంటారు. గంగ నదిలో అస్థికలు కలిపినా.. నదిలో భక్తిశ్రద్ధలతో స్నానం ఆచరించిన మోక్షం లభిస్తుందని నమ్మకం.

మానవ జీవితానికి, మోక్షానికి దగ్గరగా ఉన్న ప్రదేశం కాశీ. ఏడు పవిత్ర స్థలాలలో ఇది ఒకటి. ఈ పట్టణంలోని ప్రతి మూల, ప్రతి పాయింట్ మన సంప్రదాయ, ప్రాచీన జ్ఞానంతో ప్రతిధ్వనిస్తుంది. ఇది అంతులేని విశ్వశక్తికి ఆవాసం. జీవితం గడిచిపోయింది, రాజ్యాలు, రాజులు పోయారు. కానీ కాశీ మాత్రం అందరి మధ్య ఉన్నతంగా నిలిచింది. కాశీ ప్రయాణం భక్తిమయంతో సాగే అద్భుతమైన ప్రయాణం. వారణాసిలోని ఆనందవన్, అస్సీఘాట్, కర్తమేశ్వర దేవాలయాలు పురానతమైనవి. కాశీ ప్రయాణం అద్భుతం, అంతులేనిది. వర్ణించలేనిది. 

పవిత్ర క్షేత్రం రామేశ్వరం

దక్షిణాన ఉన్న రామేశ్వర లింగానికి ఉత్తరాన ఉన్న కాశీయాత్రకు సంబంధం ఉంది. కాశీ యాత్ర చేసేవారు కాశీలోని గంగా జలాన్ని తీసుకువచ్చి రామేశ్వరంలోని సముద్రంలో కలపాలని అప్పుడే కాశీ యాత్ర పూర్తవుతుందని పురాణాలు చెబుతున్నాయి. రావణాసురుడిని సంహరించిన తర్వాత బ్రహ్మహత్యా పాతకం నిర్మించుకోడానికి శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడు. రామేశ్వరంలో అనేక తీర్థ స్థలాలతో పాటు అనేక చీచ్‌లు ఉన్నాయి.

ఇక్కడి ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. గంధమాదవ పర్వతం రామేశ్వరంలోని ఎత్తున ప్రదేశం. ఈ ప్రదేశంలో రావణుడు సీతాదేవిని అపహరించుకొని వెళ్తున్నప్పుడు నగలు పారవేసిందని చెబుతారు. రామేశ్వరం దీవి, సముద్ర కెరటాలు, ఇసుక తిన్నెలు, పక్షులు, రామనాథ స్వామి గుడి, ఖండ్రిక గ్రామం, పంబన్ బ్రిడ్జి, గంధమాదవ పర్వతం, ధనుష్కోటి, కోదండరామ దేవాలయం, పంచముఖ హనుమాన్ ఆలయం, తీర్థ బావులు తప్పక చూడాల్సిన ప్రదేశాలు. 

పూరీ జగన్నాథ వైభవం..

ఆధ్యాత్మిక జీవనంలో తీర్థ యాత్రలకు ఒక విశిష్ట స్థానం ఉంది. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతిప్రాణి పుడుతూనే భగవత్ భక్తిని శ్వాసిస్తూ పుడుతుంది. అందుకే భగవంతుడు వివిధ రూపాలతో, వివిధ నామాలతో ఈ భారతావనిపై అవతరించి, ఆధ్యాత్మిక సుసంపన్నం చేశాడు. విదేశీయులు సైతం ఆధ్యాత్మిక స్రవంతిలోకి ఆకర్షించే శక్తి ఒక్క మన దేశంలోనే ఉన్నదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇందుకు కారణం మన సంస్కృతి, పండుగలు, ఆలయాలలో జరిగే ఉత్సవాలు, వేడుకలు. మనదేశంలో ఎన్నో పవిత్ర దేవాలయాలు ఉన్నప్పటికీ పూరీ క్షేత్రంలో సోదర, సోదరీ సహితుడై కొలువున్న ‘జగన్నాథ స్వామీ’ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ ఉత్సవ పూర్తి ఆకారంలోనే కాదు, ఆయనకు సమర్పించే ప్రసాదాలలోనూ ఓ ప్రత్యేకత ఉంది.

జగన్నాథుని రథయాత్ర అంటే ఆ బాలగోపాలానికి ఓ పర్వం. సాధారణంగా ఏ ఆలయంలోనైనా భగవంతుడు భార్యసమేతుడై కొలువుతీరి ఉంటాడు. కానీ పూరీ క్షేత్రంలోని జగన్నాథుడు మాత్రం తన సోదరుడు ‘బలభద్రుడు’ తోనూ, సోదరి ‘సుభద్ర’ తోనూ కొలువుతీరి సేవలు అందుకొంటూ ఉంటాడు. సుమారు నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన జగన్నాథుని ఆలయంతో పాటు వినాయకునికి, లక్ష్మీ పార్వతులకు, శివునకు, నవగ్రహాలకు ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి.