17 June, 2026 | 1:42 AM

తెలంగాణ క్రికెట్‌ను వ్యాపారంగా మార్చేశారు

17-06-2026 12:36 AM

హెచ్‌సీఏపై టీసీఏ మండిపాటు

హైదరాబాద్, జూన్ 16: కొందరు రాజకీయ పెద్దలు హెచ్‌సీఏలోని అవినీతి తిమింగలాలు కలిసి తెలంగాణ క్రికెట్‌ను వ్యాపారంగా మార్చేశాయని టీసీఏ జనరల్ సెక్రటరీ ధరం గురువారెడ్డి మండిపడ్డారు. టీజీ20 అనే దొంగ లీగ్‌ను తెరపైకి తెచ్చి అమాయక ప్రజలను, యువ క్రికెటర్లను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

ఈ అక్రమ సామ్రాజ్యంలో భాగమైన అందరికీ టీసీఏ క్రిమినల్, లీగల్ నోటీసులు జారీ చేయబోతున్నట్టు తెలిపారు. టీజీ20 లీగ్‌కు అసలు బీసీసీఐ అనుమతి లేదనీ, కొందరు పెద్దల పేర్లు చెప్పి ఫార్స్ షో నడిపిస్తున్నారనీ ఆరోపించారు.

టీజీ20 లీగ్ లో ఫ్రాంచైజీలను అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ల కుటుంబసభ్యులు, బినామీ కంపెనీలు హోల్‌సేల్‌గా కొనేశారనీ విమర్శించారు. బీసీసీఐ రాజ్యాంగంలోని రూల్ 31 ప్రకారం ఈ అనుమతి లీగ్ నిబంధనల ఉల్లంఘనగా చెప్పుకొచ్చారు. ఇలాంటి అవినీతిమ యమైన లీగ్‌లో అడుగుపెడితే సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా కేసుల్లో ఇరుక్కుంటారని గురువారెడ్డి హెచ్చరించారు. ముఖ్యంగా టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్‌కు ఎలాంటి లీగల్ అర్హతా లేదన్నారు. 

హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ను హైకోర్టు ఇప్పటికే సస్పెండ్ చేసిందనీ, సెక్రటరీ ఎన్నిక కూడా పూర్తిగా మోసమని గురువారెడ్డి ఫైరయ్యారు. తాము మోసం చేయడమే కాకుండా తిలక్ వర్మ, సిరాజ్ లాంటి అంతర్జాతీయ క్రికెటర్ల పేర్లు వాడుకుని తప్పుడు సందేశం ఇస్తున్నారని ఆగ్రహం వ్కక్తం చేశారు. జిల్లాల ప్లేయర్లకు 60 శాతం కోటా ఇచ్చామన్న హెచ్‌సీఏ మాటలు పూర్తిగా అవాస్తవమన్నారు. నిజమైన జిల్లా ప్లేయర్లు లీగ్‌లో కనీసం 4 శాతం కూడా లేరనీ, హైదరాబాద్‌కు చెందిన క్రికెటర్లనే తీసుకున్నారని ఆరోపించారు.