సహజత్వానికి దగ్గరగా ఉండేలా తీసిన చిత్రమిది
వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో రాశిసింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవిప్రసాద్, సూర్య, బాబా భాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీని జూన్ 19న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో వీవీ వినాయక్ మాట్లాడుతూ.. “వడ్డే నవీన్ కెరీర్‌లోని 90 శాతం సినిమాలు మనస్ఫూర్తిగా చేయలేదు.. ఆ విషయం నాకు తెలుసు. సినిమాల పట్ల ఆయనెప్పుడూ తృప్తిగా ఉండరు. ఓ సందర్భంలో ఆయన పరపతి చూసి షాక్ అయ్యా. ఇకపై ఆయన తన మనసుకు నచ్చిన చిత్రాలే చేయాలని కోరుకుంటున్నా. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు. హీరో వడ్డే నవీన్ మాట్లాడుతూ.. “ఈ మూవీలో కోర్ట్ డ్రామాతోపాటు సస్పెన్స్ బాగుంటుంది. ఏ శుక్రవారం అయినా కూడా సింగిల్‌గా సినిమా రాలేదు.
ఒకరితో పోటీ అని కాదు.. మూవీ బాగుంటేనే ప్రేక్షకులు చూస్తారు. ఈ చిత్రాన్ని సహజత్వానికి దగ్గరగా ఉండేలానే చూసుకున్నాం. ఇందులోని కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా” అన్నారు. ‘ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేశారు. అందరూ మా సినిమాను చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాన’ని కథానాయకి రాశీసింగ్ అన్నారు. డైరెక్టర్ కమల్ తేజ నార్ల మాట్లాడుతూ.. “టీజర్, ట్రైలర్ల కంటే మా సినిమా అద్భుతంగా ఉండబోతోంది. జూన్ 19న సినిమాని చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొన్నారు.






