03-02-2026 01:36:46 AM
నవీన్‌చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణకుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’. ఓవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్‌రెడ్డి నిర్మించారు. ఫిబ్రవరి 6న థియేటర్‌లో రిలీజ్ అవుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఈవెంట్‌లో హీరో నవీన్‌చంద్ర మాట్లాడుతూ.. “ఇది మౌత్ టాక్‌తో నిలబడే సినిమా. ఈ సమాజంలో ఆశ కోసం ప్రజలు ఏవేవో చేస్తున్నారు. ఇందులో ఒక డార్క్ సొసైటీని చూపించాం.
ఈ కథ విన్న తర్వాత నేను చాలా జాగ్రత్తగా ఉన్నా. ఈ సినిమా చేసినప్పుడు చాలా మ్యాడ్‌నెస్‌లో ఉన్నా. ఈ సినిమా షూటింగ్‌లో ఒక సంఘటన జరిగింది. ఈ క్యారెక్టర్ ప్రభావం వల్ల ఒక వ్యక్తితో నేను దురుసుగా ప్రవర్తించా. అయితే అది నేను కాదు. ఆ క్యారెక్టర్ అలా ప్రవర్తించింది” అన్నారు. డైరెక్టర్ కరుణకుమార్ మాట్లాడుతూ.. “హనీ సినిమాలో పిల్లి మాయ అనే ఒక వస్తువుని శోధించి సాధించే ఒక వ్యక్తి జీవితం చూపించాం. మెదడు అంతా చీకటి ఉన్నా మనసుల మధ్య జరిగిన ఒక కథ. నిజ జీవిత సంఘటన నుంచి స్ఫూర్తిగా తీసుకుని సినిమా చేశాం.
మనిషి మెదడు కంటే పెద్ద దయ్యం లేదనేది ఈ సినిమా సారాంశం. ఇదొక ఫ్యామిలీ స్టోరీ. అందరికీ చెప్పాల్సిన కథ. సినిమా ఒకరి జీవితాన్ని మార్చలేదు.. సందేశాన్ని కూడా ఇవ్వలేదు. కానీ ఒక తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని టార్చి వేసి చూపించగలదు. నేను కూడా అదే చేశానని నమ్ముతున్నా” అని చెప్పారు. ‘ఒకరికి మించి ఒకరు పెర్ఫార్మన్స్ ఇచ్చే నటుల మధ్య నటించడం చాలా ఆనందంగా వుంద’ని హీరోయిన్ దివి తెలిపింది. మరో కథానాయిక దివ్య పిళ్లై మాట్లాడుతూ.. “డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు భయపడ్డాను. చాలా కొత్త కథ ఇది. తప్పకుండా ఈ సినిమా అందరికీ ఒక కొత్త అనుభూతిస్తుంది” అని చెప్పింది. ఇంకా ఈ వేడుకలో రాజారవీంద్ర, మిగతా మూవీటీమ్ పాల్గొన్నారు.