03-02-2026 01:34:55 AM
తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ బ్యానర్లపై వెంకటేశ్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరో, హీరోయిన్లుగా నటించిన యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం ‘వన్/4’ (వన్ బై ఫోర్). ‘బాహుబలి’ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన బాహుబలి పళని కే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రంజన రాజేశ్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ నిర్మించారు. ఇటీవల రిలీజైన ఈ సినిమా సక్సెస్ మీట్‌లో హీరో వెంకటేశ్ పెద్దపాలెం మాట్లాడుతూ.. “మహిళలు చూడాల్సిన చిత్రమిది.
సినిమా బాగుందని అంతా అంటున్నారు. ఎంతో ప్యాషన్‌తో సినిమా నిర్మించిన ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రమోషన్స్‌కు రాని నటీనటులు ఆలోచించుకోవాలి” అన్నారు. డైరెక్టర్ బాహుబలి పళని మాట్లాడుతూ.. “మా వన్ బై ఫోర్ సినిమాను ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్ చేశారు. మా హీరో వెంకటేశ్ తన ఫైట్స్, పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. అతను కన్నడలో యాక్షన్ సినిమా చేశాడు. తెలుగులో వెంకటేశ్‌కు మంచి అవకాశాలు వస్తాయి” అన్నారు. నిర్మాత రంజన రాజేశ్ గుంజల్ మాట్లాడుతూ.. “ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మంచి మెసేజ్ ఉన్న మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. స్ట్రాంగ్ కంటెంట్ ఉండటం వల్లే ఈ విజయం దక్కింది.
బ్లాక్‌మెయిలింగ్ వల్ల ఓ మహిళ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందనేది మా సినిమాలో చూపించాం. మా చిత్రానికి హీరోయిన్స్ నుంచి ప్రమోషన్ కోసం సపోర్ట్ లభించకపోవడం బాధగా ఉంది. హీరోయిన్స్ ప్రమోషన్‌కు రాకుండా సినిమాకు నష్టాన్ని తీసుకొచ్చారు. ఇలాంటి నార్త్ హీరోయిన్స్ కంటే తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించడం మంచిదనిపిస్తోంది” అన్నారు. నిర్మాత రోహిత్ రాందాస్ గుంజల్ మాట్లాడుతూ.. “తెలుగు సినిమాలపై అభిమానంతో మేము ముంబై నుంచి టాలీవుడ్‌కు వచ్చాం. మా తొలి ప్రయత్నంలోనే మంచి విజయం దక్కింది. మా చిత్రంలోని నటీనటులు ప్రమోషన్స్‌కు వచ్చి ఉంటే మా సినిమా మరింతగా ప్రేక్షకుల దగ్గరకు వెళ్లేది” అన్నారు.