17 July, 2026 | 12:09 AM

ఇది చాలు ఈ జన్మ కు

03-12-2024 03:31 AM

అల్లు అర్జున్ కథానాయకుడిగా రూపొందిన ‘పుష్ప 2’ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి నిర్మాతలు. చిత్రబృందం తాజాగా సోమవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటుచేసింది. ‘వైల్డ్ ఫైర్ జాతర’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘నేను ఐదేళ్లుగా పనిచేస్తున్న వన్ అండ్ ఓన్నీ హీరోయిన్ నా శ్రీవల్లి. సుకుమార్‌కు ఇదే ది బెస్ట్ మూవీ. ఆయన లేకపోతే నేను లేను. ఈ సినిమా ఆడాలని నేను మూడే సార్లు అనుకున్నా. ఈయన కష్టం కోసమైనా ఆడాల్రా బాబు అని ఓసారి, షూటింగ్ అయిపోయినప్పుడు అందరి ఫేస్‌లు చూస్తూ అనుకున్నా.. మెమరబుల్ సినిమాగా ఉండాలనుకున్నా.. మన తెలుగు సినిమాలు బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలను ప్రపంచం ఆదరిస్తున్నప్పుడు మూడోసారి అనుకున్నా.

ఇది ప్రపంచం ఆదరించే మూడో సినిమా కావాలని అనుకున్నా. ప్రపంచవ్యాప్తంగా 12 వేల థియేటర్లతో సినిమా రిలీజ్ అవుతోంది.. ఇది చాలు ఈ జన్మకి’ అని తెలిపారు. డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కేవలం బన్నీ మీద ఉన్న ప్రేమతోనే చేశా. ఎందుకంటే ఆయన ఒక చిన్న ఎక్స్‌ప్రెషన్ కోసమే ఫైట్ చేస్తాడు. అతనిలోని ఆ తపన చూసే ఈ సినిమా చేయాలనిపించింది. సీన్ చెప్తున్నప్పుడు అంతటి ఎనర్జీ ఇస్తాడు.

బన్నీతో ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు నా దగ్గర కథ లేదు.. ఊరకే ఓ రెండు సీన్లు మాత్రమే చెప్పా’ అని తెలిపారు. చిత్ర కథానాయకి రష్మిక మందన్న మాట్లాడుతూ.. ‘పుష్ప1 చేస్తున్నప్పుడే పుష్ప 2లో ఇంతకంటే బాగా చేయాలనుకున్నా. ఈరోజు నేను ఇలా నటిస్తున్నానంటే అది కేవలం సుకుమార్, అల్లు అర్జున్ వల్లే. సుకుమార్ అంతర్జాతీయ స్థాయిలో నిలిచిపోవాలని కోరుకుంటున్నా.

మైత్రి మూవీ మేకర్స్‌తో మరిన్ని సినిమాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ చిత్రం కోసం ఐదేళ్లుగా ఇంతగా కష్టపడిన చిత్రబృందానికి ధన్యవాదాలు. శ్రీలీల చేసిన డాన్స్‌తో నా హార్ట్ కిస్సిక్ అయిపోయింది. అల్లు అర్జున్‌తో కలిసి నటించడం నా అదృష్టం. మీరు సరిహద్దులు దాటి వెళ్లేలా చేశారు’ అని చెప్పారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “నేను వారం క్రితం సినిమా చూసి ఇంటికి వెళ్తే నా భార్య.. ‘మగధీర’ ముందు మీ మొహం ఎంత వెలిగిపోవడం చూశాను. మళ్లీ ఇప్పుడు..’ అని చెప్పింది” అన్నారు.

దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. “పుష్ప 1’ సమయంలో బన్నీతో నార్త్ ఇండియాని వదలకు. అక్కడ నీకోసం ఎంతోమంది అభిమానులున్నారని చెప్పా. ‘పుష్ప 2’కు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రమోషన్స్ అవసరం లేనంతగా క్రేజ్ వచ్చింది. రామోజీ ఫిలిం సిటీలో పుష్ప షూటింగ్ జరుగుతుండగా వెళ్లినప్పుడు నాకు పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్ చూపించారు. అప్పుడే అర్థమైపోయింది సినిమా ఎలా ఉండబోతుందనేది! వర్షం కూడా పడుతోంది, ఇది కచ్చితంగా ఒక శుభమే (ఈవెంట్ కొనసాగుతున్న మైదానంలో వర్షం పడటాన్ని ఉద్దేశిస్తూ..)’ అన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా అల్లు అర్జున్ పిల్లలు 

‘వైల్డ్‌ఫైర్ జాతర’లో అల్లు అర్జున్ పిల్లలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన కుమారుడు అల్లు అయాన్ మాట్లాడుతూ.. ‘పుష్ప చాలా బాగుంటాది ఇంకా తగ్గేదెలే’ అన్నాడు. కుమార్తె అల్లు అర్హ  ఓ తెలుగు పద్యాన్ని గుక్క తిప్పకుండా  చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కార్యక్రమానికి దర్శకులు వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ, మలినేని గోపీచంద్, బుచ్చిబాబు అతిథులుగా హాజరై మాట్లాడారు. హీరోయిన్ శ్రీలీల, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌తోపాటు, నిర్మాతలు, నటీనటవర్గం, సాంకేతిక వర్గం మాట్లాడి ఈ చిత్రంతో తమ జర్నీ తీరును పంచుకున్నారు.