‘తెలుసు కదా’ ప్లస్ అవుతుందా?
హిట్, ఫట్‌లతో సంబంధం లేకుండా దూసుకెళ్లే ముద్దుగుమ్మలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మంది మాత్రమే ఉంటారు. టాలీవుడ్‌లో అయితే ఆ సంఖ్య మరీ తక్కువ. అలా దూసుకెళ్లి ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ముద్దుగుమ్మ రాశీఖన్నా. తొలుత ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నారట. ఆ తరువాత కాలేజ్ డేస్‌లో పాకెట్ మనీ కోసం యాడ్స్‌కి కాపీ రైటర్‌గా చేశారట. రాశీఖన్నా అందంగా ఉండటంతో యాడ్స్‌లో నటించే అవకాశం కూడా వచ్చింది.
ఆ తరువాత హిందీ మూవీ ‘మద్రాస్ కేఫ్’తో సినిమాల్లోకి వచ్చారు. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అమ్మడు ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో హిట్స్ సంఖ్య చాలా తక్కువ. అయినా సరే అవకాశాలు మాత్రం వెల్లువెత్తాయి. అటు హీరోయిన్‌గానూ.. ఇటు సింగర్‌గానూ రాణించారు. స్టార్ హీరోయిన్‌గా నిలబడకపోయినా అవకాశాలకు మాత్రం కొదువ ఉండేది కాదు. ఆ తరువాత ఎందుకో ఒక్కసారిగా టాలీవుడ్‌కి దూరమయ్యారు. అవకాశాలు రాలేదో మరే కారణమో తెలియదు కానీ అమ్మడు మాత్రం కొంత కాలం పాటు తెలుగు సినిమాలో కనిపించలేదు. స్లిమ్ అయి వచ్చినా కూడా ఫలితం దక్కలేదు. ఇన్నాళ్లకు తెలుగులో ‘తెలుసు కదా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. తమిళ్, హిందీ భాషల్లోనూ అవకాశం సంపాదించారు. ఆ చిత్రాలు రాశీకి ప్లస్ అవుతాయో లేదో చూడాలి.






