8 March, 2026 | 4:17 AM

ఆ వ్యాఖ్యలు సరికాదు!

08-03-2026 01:09 AM

వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్‌కుమార్‌తో కలిసి దోశ డైరీస్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం ‘ఎస్.సరస్వతి’. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. మార్చి 6న ఈ సినిమా థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం సందడి చేస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ శనివారం థాంక్ యూ మీట్ నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఈ మూవీ కథకుడు సాయిమాధవ్ బుర్రా.. తన కథను రేప్ చేశారంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై వరలక్ష్మి స్పందించారు. “మూల కథను సాయిమాధవ్ నుంచి తీసుకున్నాం. అందులో కొన్ని మార్పులు చేశాం. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాతే సాయిమాధవ్ నుంచి ఈ కథ తీసుకున్నాం. ఆయన రాసిన కథ చాలా ల్యాగ్ ఉందని చాలా మంది అన్నారు.

క్లుమైక్స్ మార్చాలని ఆయనకు ముందు నుంచే చెప్పా. ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని కథలో మార్పులు చేశా. కథ క్రెడిట్ కూడా ఆయనకే ఇచ్చాం. అయినా ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు” అన్నారు. అనంతరం సినిమా గురించి మాట్లాడుతూ.. “థియేటర్లలో మా సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇది కేవలం విమెన్ సెంట్రిక్ సినిమా కాదు. ఇది ఒక మంచి థ్రిల్లర్‌” అని తెలిపారు. ‘ఎస్.సరస్వతి సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంద’ని నిర్మాత పూజా శరత్‌కుమార్ చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిచోలాయ్ సచ్‌దేవ్, చిత్రబృందం పాల్గొన్నారు.