యోగాతో యోగం!
- ప్రపంచ శ్రేయస్సుకు చక్కటి సాధనం
- అనేక దేశాధినేతలు యోగాపై చర్చించారు
- అంతర్జాతీయ యోగా వేడుకల్లో మోదీ
- శ్రీనగర్‌లో యోగాసనాలు వేసిన ప్రధాని
శ్రీనగర్, జూన్ 21: ప్రపచం శ్రేయస్సుకు యోగా ఎంతో చక్కటి సాధమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. విశ్వ మానవ సంక్షేమానికి యోగానే సరైన సాధమని ప్రపంచం మొత్తం నమ్ముతున్నదని పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ యోగా దినో త్సవం సందర్భంగా జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో యోగా వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. షేర్ ఏ కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (ఎస్‌కేఐసీసీ)లో ప్రజలతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు.
అనంతరం దేశానికి సందేశమిచ్చారు. ‘ప్రపంచ సంక్షేమానికి యోగా శక్తిమంతమైన సాధనమని ప్రపంచం నమ్ముతున్నది. గతానికి సం బంధించిన భారం లేకుండా వర్తమానంలో జీవించేలా యోగా సహాయ పడుతుంది. యోగా దినోత్సవం సందర్భంగా భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా యోగా సాధనలో పాలుపంచుకొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యోగాను తమ నిత్యజీవితంలో ఒక భాగంగా మార్చుకొన్నారు. యోగాను సాధన చేస్తున్నవారు నిత్యం పెరుగుతూనే ఉన్నారు. నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా యోగా ప్రయోజనాల గురించి నాతో చర్చించని నేతలు చాలా తక్కువమంది ఉన్నారు’ అని పేర్కొన్నారు.
ప్రపంచ శాంతికి యోగానే మార్గం
ప్రపంచవ్యాప్తంగా నేడు అనేకచోట్ల యుద్ధాలు, జాతుల ఘర్షణలు చెలరేగుతున్న నేపథ్యంలో విశ్వశాంతికి యోగా ఉప యోగపడుతుందని ప్రధాని అన్నారు. ‘మనం అంతర్గతంగా శాంతియుతంగా ఉంటే.. ప్రపంచంపై సానుకూల ప్రభావం చూపగలం. సమాజంలో యోగా సానుకూల మార్పులు తెస్తుంది’ అని తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన 101 ఏండ్ల చార్లెట్ చాపిన్ తన దేశంలో యోగాకు విస్తృత ప్రచారం కల్పించినందుకు ఆయనను భారత ప్రభు త్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. ఉత్తరాఖండ్, కేరళ వంటి రాష్ట్రాల్లో యోగా టూరిజం బాగా పెరుగుతున్నదని తెలిపారు. యోగాసనాలు వేసిన తర్వాత ప్రజలతో కలిసి మోదీ సెల్ఫీలు తీసుకొన్నారు.
సముద్రం నుంచి హిమ శిఖరం దాకా యోగా
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచం నలుమూలల లక్షల మంది ఔత్సాహికులు ఉత్సాహంగా శుక్రవారం యోగాసనాలు వేశారు. సముద్రం అలల నుంచి హిమశిఖరాల అంచుల దాకా యోగా ప్రతిధ్వనించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సైని స్థావరమైన హిమాలయాల్లోని సియాచిన్‌లో భారత సైనికులు యో గసనాలు వేశారు. కఠిన వాతావరణ పరిస్థితులను లెక్కచేకుండా శుక్రవారం ఉదయమే యోగాభ్యాసం చేశారు. థార్ ఎడారి ఇసుక దిబ్బలపై పారామిలిటరీ దళాలు యోగా సనాలు వేశాయి. భారత నావికాదళం ముంబై తీరంలో యుద్ధ నౌకపై యోగా విన్యాసాలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వయసుతో సం బంధం లేకుండా లక్షల మంది ప్రజలు యోగా దినోత్సవంలో పాల్గొన్నారు.






