హత్యాయత్నం కేసులో ముగ్గురి అరెస్ట్
జవహర్ నగర్, ఆగస్టు 7 (విజయక్రాంతి): పాత కక్షల నేపథ్యంలో ఒక వ్యక్తిపై ఇనుప రాడ్‌తో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించిన కేసులో ముగ్గురు నిందితులను జవహర్ నగర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జవహర్ నగర్ ఏసిపి చక్రపాణి, సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదులు, ఎస్ఐ రాము, తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు ఎం.సుధీర్ కుమార్ (28), గార్డెనర్‌గా పనిచేస్తూ యాప్రాల్‌లోని భగత్ సింగ్ నగర్‌లో నివాసముంటున్నాడు. నిందితుడు సందీప్ కుమార్ అలియాస్ కుట్టన్‌తో సుధీర్ కుమార్‌కు గతంలో వివాదాలు ఉన్నాయి. ఈ నెల 06వ తేదీన మధ్యాహ్నం 12:00 గంటల సమయంలో సుధీర్ కుమార్ తన సోదరుడు దీపక్‌తో కలిసి యాప్రాల్‌లోని ఆదిత్య వైన్స్ వద్ద ఉన్నాడు. ఆ విషయాన్ని నిందితుడు సందీప్ కుమార్ స్నేహితులైన ఎస్. వివేక్, వి. సుమిత్ రాఘవన్ గమనించి సందీప్‌కు సమాచారం అందించారు. వెంటనే సందీప్ కుమార్ ఇనుప రాడ్‌తో అక్కడికి చేరుకుని, సుధీర్ కుమార్‌ను చంపాలనే ఉద్దేశంతో అతని తలపై పదేపదే కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. ఈ నేరంలో మిగతా ఇద్దరు కూడా అతనికి సహకరించారు.
దర్యాప్తు నిందితుల అరెస్ట్:
తీవ్రంగా గాయపడిన సుధీర్ కుమార్‌ను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా, జవహర్ నగర్ పోలీసులు ఆస్పత్రిలో అతని వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఆర్ . నెం . 1127/2026, యూ /సెక్షన్ 109(1) ఆర్ /డబ్ల్యూ 3(5) బీ ఎన్ ఎస్ కింద కేసు నమోదు చేసి, సబ్-ఇన్స్పెక్టర్ బి. రాము దర్యాప్తు చేపట్టారు.
నిందితులు పరారవుతుండగా ఆగస్టు 06/07 రాత్రి యాప్రాల్ ఎక్స్ రోడ్స్ వద్ద జవహర్ నగర్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. నిందితుల సమాచారం మేరకు సంఘటనా స్థలం పక్కన దాచిపెట్టిన 30 అంగుళాల పొడవున్న ఇనుప రాడ్‌ను కేసు ఆధారంగా సిసిటివి ఫుటేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన నిందితుల వివరాలు:
ఏ -1: సందీప్ కుమార్ అలియాస్ కుట్టన్ (27), వృత్తి: డ్రైవర్, నివాసం: యాప్రాల్
ఏ -2: ఎస్. వివేక్ (38), వృత్తి: వెల్డింగ్ వ్యాపారం, నివాసం: యాప్రాల్
ఏ -3: వి. సుమిత్ రాఘవన్ (26), వృత్తి: టాటూ వ్యాపారం, నివాసం: యాప్రాల్
ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జవహర్ నగర్ సీఐ ఎస్. సైదులు, ఎస్ఐ బి. రాము వారి సిబ్బంది సమర్థవంతంగా వ్యవహరించి నిందితులను అరెస్ట్ చేసినట్లు జవహర్ నగర్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చక్రపాణి తెలిపారు.






