6 June, 2026 | 2:19 AM

సిలిండర్ పేలి ముగ్గురి సజీవ దహనం

06-06-2026 01:04 AM
  1. అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్‌తో అంటుకున్న నిప్పు రవ్వలు
  2. గాఢ నిద్ర నుంచి అనంత లోకాలకు
  3. మృతుల్లో అమ్మమ్మ, మనవడు, మవరాలు
  4. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం

మిర్యాలగూడ, జూన్ 5 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా మిర్యాలగూడ  పట్టణంలోని కలాల్ వాడలో గురువారం అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలి అమ్మమ్మ, మవడు, మవరాలు ముగ్గురు సజీవ దహనం అయ్యారు. కలాల్ వాడలో వనం చంద్రకళ (48) తన పెద్ద కుమార్తె ధనలక్ష్మి ఆమె ఇద్దరు పిల్లలు లక్ష్మణ్ (17), ప్రణతి (15)తో కలసి జీవిస్తున్నది. చంద్రకళ భర్త పక్షవాతంతో బాధపడుతూ నెల రోజుల క్రితమే చనిపోయాడు.

దీంతో కుటుంబ పోషణ కోసం పెద్ద కూతురు ధనలక్ష్మి తన ఇద్దరు పిల్లలను తల్లి వద్ద ఉంచి నాలుగు రోజుల క్రితమే ఇండ్లలో పని చేసేందుకు మహారాష్ట్రలోని పూణే వెళ్లింది. గురువారం అర్ధరాత్రి చంద్రకళ, మనవడు లక్ష్మణ్, మనవరాలు ప్రణతి గాఢ నిద్రలో ఉండగా.. ఈదురుగాలులకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల నిప్పు రవ్వలు లేచి మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు గ్యాస్ సిలిండర్‌కు అంటుకోవడంతో అది పేలింది.

ఇళ్లంతా మంటలు చెలరేగడంతో నిద్రలో ఉన్న ముగ్గురు తేరుకునే లోపే అంటుకుని, సజీవ దహనం అయ్యారు. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేదు. మంటలు గ్యాస్ సిలిండర్ కి వ్యాపించడంతో భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనతో క్షణాల్లోనే ఇల్లంతా మంటలు వ్యాప్తించి ముగ్గురు బయటకు రాలేక మంటలకు ఆహుతి అయ్యారు. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు.

డీఎస్పీ రాజశేఖర్ రాజు, సీఐ నాగభూషణంరావు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా చంద్రకళకి ఇద్దరు కూతుళ్లు కాగా పెద్ద కుమార్తె ధనలక్ష్మిని వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన నక్క సైదులుకి ఇచ్చి వివాహం జరిపించారు. పదేండ్ల క్రితమే ధనలక్ష్మి భర్త అనారోగ్యంతో మృతి చెందగా మిర్యాలగూడలో తల్లి వద్దనే పిల్లలతో కలిసి జీవిస్తుంది. బాధిత కుటుంబాన్ని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా డ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి వేర్వేరుగా పరామర్శించారు.