07-08-2025 12:09:01 AM
ఏడాకులపల్లిలో ఘటన
జహీరాబాద్ ఆగస్టు 6 : జహీరాబాద్ నియోజకవర్గంలోని ఏడాకులపల్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన గొర్రె కంటి శంకరమ్మ గ్యాస్ సిలిండర్ ఖాళీ అవ్వడంతో కొత్త సిలిండర్ అమర్చారు.. తర్వాత మెల్లమెల్లగా గ్యాస్ లీక్ కావడంతో కుటుంబ సభ్యులు గమనించలేదు. వారి కుమారుడు పూజ గదిలోకి వెళ్లి దీపం వెలిగించడంతో గ్యాస్ అంతా నిండుకొని ఉండడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మొదట శంకరమ్మకు మంటలు తగలడంతో ఆమెను రక్షించేందుకు ఆమె కుమారులు గొర్రె కంటి ప్రభు, విట్టల్ ప్రయత్నించారు. దీంతో వారికి కూడా నిప్పు అంటుకొని గాయాలయ్యాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో పెద్ద శబ్దం వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో చుట్టుపక్కల వారు వారిని అంబులెన్స్ లో జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే
ఏడాకులపల్లిలో సిలిండర్ పేలి ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మానిక్రావు ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అక్కడి వైద్యులతో మాట్లాడి వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్య సేవల కోసం జిల్లా ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాటు చేశారు. డాక్టర్కు ఫోన్లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేతో పాటు ఝరాసంగం మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు మాచునూరు వెంకటేశం, సీనియర్ నాయకుడు నామకవి కిరణ్ ఉన్నారు