13 May, 2026 | 7:53 PM

టామ్ కామ్ తో విదేశాల్లో యువతకు ఉపాధి

13-05-2026 07:20 PM

- మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

- సింగరేణి సహకారంతో మందమర్రిలో జర్మనీ జాబ్ ట్రైనింగ్ క్యాంప్ 

-జూన్ 10 నుండి ప్రత్యేక శిక్షణ తరగతులు

మందమర్రి,(విజయ క్రాంతి): నైపుణ్యాభివృద్ధి, భాషా శిక్షణ, వృత్తిపరమైన శిక్షణ ద్వారా స్థానిక యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ కర్మాగారాల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్‌లో సింగరేణి సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన "జర్మనీ జాబ్ ట్రైనింగ్ క్యాంప్" లో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్మనీలో ఉద్యోగ అవకాశాల కోసం ఎంపికైన అభ్యర్థులకు జూన్ 10, 2026 నుండి ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. విదేశీ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యం పెంపొందించేందుకు టామ్కామ్ వద్ద తగిన మౌలిక వసతులు, నిపుణులైన శిక్షకులు అవసరమైన బడ్జెట్ అందుబాటులో ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ శిక్షణా కార్యక్రమాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడంలో యువతను ప్రోత్సహించడంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్  చూపిస్తున్న చొరవను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

జిల్లా యంత్రాంగం అందిస్తున్న సహకారం వల్ల మరింతగా యువతకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అండగా నిలిచిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) యాజమాన్యానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకించి సింగరేణి సి.ఎం.డి బుద్ధ ప్రకాష్ జ్యోతి కి మందమర్రి జి.ఎం ఎన్. రాధాకృష్ణ కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ యువత అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ఉద్దేశమని, ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ N .రాధాకృష్ణ, ఎం.ఆర్.ఓ సతీష్ కుమార్, DGM పర్సనల్ అశోక్, GMVTC మేనేజర్ శ్రీధర్,టామ్ కామ్ మేనేజర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.