బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి
* 31 గంటలుగా నరకయాతన
* రాజస్థాన్‌లోని బెహార్ జిల్లాలో ఘటన
జైపూర్, డిసెంబర్ 24: రాజస్థాన్‌లోని బెహార్ జిల్లాలో మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. కోట్‌పుత్లీ ప్రాంతానికి చెందిన చేతన చౌదరి తన తండ్రి భూపేంద్ర చౌదరితో కలిసి సోమవారం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లింది. ఈ క్రమంలోనే చేతన అక్కడ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు 700 అడుగుల బోరు బావిలో పడిపోయింది. తొలుత 30 అడుగుల వద్ద చిక్కుకున్న చిన్నారి.. ఆ తర్వాత 150 అడుగులకు పడిపోయింది. ఈ క్రమంలో బాలికను రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి.
ఆక్సిజన్‌ను బోరు బావిలోకి పంపిస్తూ చిన్నారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ప్రయత్నాలు ఆశించినమేర సఫలం కాకపోవడంతో 31 గంటలుగా చిన్నారి బిక్కుబిక్కుమంటూ బోరుబావిలోనే ఉండిపోయింది. అయితే ‘హుక్ టెక్నిక్’ అమలు చేసి చిన్నారిని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.






