కలపకు నిప్పు.. ప్రకృతికి ముప్పు
చేవెళ్లలో అంతరిస్తున్న హరిత చరిత్ర!
అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలు
ప్రమాదంలో లక్షలాది రూపాయల కలప సంపద
చేవెళ్ల, మార్చి 4 (విజయక్రాంతి): ఒకప్పుడు అది ఎడారిని తలపించే బెల్లపురాతి గుట్ట.. కానీ నాటి అధికారుల దార్శనికత, కింది స్థాయి సిబ్బంది చెమట చుక్కలు తోడై ఆ రాతి నేలపై అపురూపమైన నందనవనాన్ని సృష్టించాయి. ముప్పు ఏళ్ల క్రితం మొక్కలుగా నాటిన ఆ ప్రాణాలు నేడు ఆకాశాన్నంటే టేకు వృక్షాలుగా మారి ప్రభుత్వ ఖజానాకు లక్షల ఆదాయాన్ని ఇచ్చే స్థాయికి చేరాయి. కానీ, నేటి అధికారుల ఉదాసీనత ఆ హరిత సంపదను బుగ్గిపాల్జేసేలా ఉంది. రాలిన ఆకులే ఆ చెట్లకు ఉరితాళ్లుగా మారుతుంటే, పట్టించుకోవాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
రాతి గుట్టపై హరిత విప్లవం..
నేడు అడవిని తలపిస్తున్న ఆవరణలు చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని సర్వే నంబర్ 6లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలు ఒకప్పుడు కటిక నేలలు. నాటి అధికారులు ఎంతో శ్రమకోర్చి బోర్లు వేయించి, మొక్కలను మానులయ్యే వరకు కంటికి రెప్పలా కాపాడారు. నేడు అక్కడ టేకు, వేప, చింత, యూకలిప్టస్ వంటి విలువైన వృక్షాలు విస్తరించి ఉన్నాయి. ఎంపిడిఓ కార్యాలయం, పశువైద్యశాల, విద్యుత్ శాఖ, పాత తహసీల్దార్ కార్యాలయాల ఆవరణలోకి వెళ్తే దట్టమైన అడవిలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది.
నిర్లక్ష్యం నీడన.. విష సర్పాల కోడెలు..
వేసవిలో చల్లని నీడను, ఆహ్లాదాన్ని పంచాల్సిన ఈ వృక్ష సంపద నేడు భయానకంగా మారింది. కార్యాలయాల చుట్టూ పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చి మొక్కల వల్ల విష సర్పాలు తిష్ట వేశాయి. పని వేళల్లో వచ్చే ప్రజలు, రోగులు ప్రాణ భయంతో గడపాల్సి వస్తోంది. పారిశుధ్యం పడకేయడంతో ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు, దొంగతనాలకు నిలయంగా మారే ప్రమాదం ఉంది.
చిచ్చు పెడుతున్న ఎండుటాకులు.. కలప దొంగల కన్ను!
శిశిరంలో రాలిన ఆకులు ప్రకృతి అందాన్ని పెంచాల్సింది పోయి, అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నాయి. చిన్న నిప్పు రవ్వ తగిలినా అడుగున్నర వ్యాసం, 35 అడుగుల పొడవున్న విలువైన టేకు చెట్లు నిలువునా కాలిపోయే స్థితి నెలకొంది. మరోవైపు రక్షణ లేని ఈ వృక్షాలపై కలప దొంగల కన్ను పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరి బాధ్యత? ఎవరి నిర్లక్ష్యం?..
మున్సిపల్ కమిషనర్ వెంకటేశం మరియు ఎంపిడి ఓల హిమబిందు మధ్య బాధ్యతల బదలాయింపు సాగుతోంది. ‘గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు క్లీన్ చేయించాం, ఇప్పుడు మున్సిపాలిటీ కాబట్టి ఆయా శాఖలే చూసుకోవాలి‘ అని కొందరు అంటుంటే, ‘మేము రోడ్లు, డ్రైనేజీలే చూస్తాం, ఆఫీసుల లోపల మాకేం సంబంధం‘ అని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు. ఈ సమన్వయ లోపం ప్రకృతికి శాపంగా మారింది.
తక్షణ చర్యలు అవసరం
అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి కలప విలువను అంచనా వేయాలి. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా వేలం వేయడమో లేదా పటిష్టమైన రక్షణ కల్పించడమో చేయాలి. మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి కార్యాలయ ప్రాంగణాల్లో పేరుకుపోయిన ఎండుటాకులను, చెత్తను తొలగించాలి. నాటి అధికారులు పెంచి పోషించిన ఈ ’గ్రీన్ హిస్టరీ’ని కాపాడతారో లేక నిర్లక్ష్యపు సెగల్లో కాలిపోనిస్తారో వేచి చూడాలి.




