09-02-2026 02:02:01 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ప్రస్తుత పాలక మండలి ఐదేళ్ల అధికారిక గడువు ఈ నెల 10వ తేదీ(మంగళవారం)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో, గడువు ముగియడా నికి సరిగ్గా ఒక్కరోజు ముందు అంటే.. సోమవారం స్థాయీ సంఘం స్టాండింగ్ కమిటీ మరోసారి అత్యవసరంగా భేటీ కానుండటం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే పలు అభివద్ధి పనులకు ఆమోదం తెలిపిన కమిటీ, చివరి గంటలో పెండింగ్‌లో ఉన్న మరికొన్ని కీలక ప్రతిపాదనలను క్లియర్ చేసేందుకు సిద్ధమైంది. సాధారణంగా పాలకమండలి కొలువుదీరినప్పటి నుంచి స్టాండింగ్ కమిటీ సమావేశాలు ప్రతి బుధవారం లేదా గురువారం నిర్వహించేవారు. అయితే, ప్రస్తుత కౌన్సిల్ గడువు మంగళవారంతో ముగిసిపోతుండటంతో, అనివార్య కారణాల దష్ట్యా సమావేశాన్ని సోమవారానికి మార్చారు.
గడువు ముగిసేలోపు పెండింగ్ దస్త్రాలకు మోక్షం కల్పించాలనే ఉద్దేశంతో మేయర్ అధికారులతో సమాలోచనలు జరిపి అజెండాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ చివరి సమావేశంలో ప్రధానంగా ఆర్థిక లావాదేవీలతో కూడిన అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నగరంలోని పలు విలువైన ఆస్తుల లీజు పొడిగిం పులు, కీలకమైన భూ బదలాయింపులు, కొన్ని విభాగాల్లో ఆర్థికంగా లబ్ధి చేకూర్చే ప్రతిపాదనలను అజెండాలో పొందుపరిచినట్లు సమాచారం.
వీటితో పాటు సీఎస్‌ఆర్ కింద చేపట్టిన ట్రాఫిక్ ఐలాండ్ల అభివృద్ధి, పార్కుల నిర్వహణ వంటి అంశాలకు కూడా పరిపాలనా అనుమతులు లభించే అవకాశం ఉంది. గత సమావేశంలో ముందస్తు సమాచారం లేకుండా అప్పటికప్పుడు చర్చకు తెచ్చిన టేబుల్ ఐటమ్స్‌పై మేయర్ విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఆ కారణంగా అప్పట్లో వాయిదా పడిన కొన్ని ప్రతిపాదనలను, నేడు జరిగే సమావేశంలో మళ్లీ టేబుల్ ఐటమ్స్‌గా ప్రవేశపెట్టి ఆమోదించుకునే అవకాశం ఉన్నట్లు కార్పొరేషన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కీలక నిర్ణయాల విషయంలో పారదర్శకత పాటించాలనే విమర్శలు ఉన్నప్పటికీ, చివరి నిమిషంలో పెండింగ్ ఫైళ్లను ఆమోదించుకోవడమే లక్ష్యంగా పాలకమండలి పెద్దలు కసరత్తు చేస్తున్నారు.
వీడ్కోలు సమావేశం
జీహెచ్‌ఎంసీ విభజన వార్తలు అధికారుల భారీ బదిలీల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి రాజకీయంగానూ ప్రాధా న్యం సంతరించుకుంది. నేటి భేటీ అనంతరం పాలకమండలి అనధికారికంగా వీడ్కో లు పలికే అవకాశం ఉంది. మరి ఈ ఆఖరి సమావేశంలో ఎన్ని ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది.. వివాదాస్పద నిర్ణయాలకు తావుంటుందా.. లేదా.. అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.