14 July, 2026 | 7:49 PM

అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం

05-12-2024 02:47 AM
  1. చైనా కంప్యూటర్ చిప్స్ తయారీపై యూఎస్ ఆంక్షలు
  2. అరుదైన మూలకాలను అమెరికాకు పంపడంపై  చైనా బ్యాన్

 బీజింగ్, డిసెంబర్ 4: అమెరికా చిప్ పరిశ్రమకు చైనా షాక్ ఇచ్చింది. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టగానే చైనా దిగుమతులపై 10 శాతం సుంకం విధిస్తానని ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో చైనాలోని కంప్యూటర్ చిప్స్ తయారీ పరిశ్రమపై అమెరికా ఆంక్షలు విధించింది.

దీనిపై చైనా తీవ్రంగా స్పందించి అరుదైన మూలకాలతో తయారు చేసే వస్తువులను యూఎస్‌కు ఎగుమతి చేయకూడదని నిషేధం విధించింది. సైనిక, పౌర అవసరాలకు ఉపయోగించే గాలియం, జెర్మేనియం, యాంటీమోనీ, సూపర్ హార్డ్ మూలకాలపై ఈ నిషేధం వర్తిస్తోందని పేర్కొన్నది. అలాగే గ్రాఫైట్ ఎగుమతుల అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

తమ దేశ భద్రత, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. అమెరికా మాత్రం ఆర్థిక, వాణిజ్య, టెక్ అంశాలను ఆయుధాల మాదిరిగా వాడుతోందని చైనా ఆరోపించింది.తాను బాధ్యతలు చేపట్టిన తరువాత చైనాపై ఆంక్షలు విధిస్తానని ట్రంప్ ప్రకటించారు. దీంతో కొత్త ఆంక్షల జాబితాలో ఉన్న వాటిని ఎగుమతి చేసే సంస్థలు ఇక నుంచి తప్పనిసరిగా వాటి చివరి వినియోగదారుడి పేరును ప్రభుత్వానికి వెల్లడించాల్సి ఉంటుంది.

దీంతో అమెరికా ఆయుధ తయారీ సంస్థల్లో చైనాపై ఆధారపడిన వాటిని గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. తాజాగా దాదాపు 24 రకాల సెమీ కండక్టర్ తయారీ పరికరాలు, మూడు రకాల సాఫ్ట్‌వేర్  టూల్స్‌ను చైనాకు ఎగుమతి చేయడంపై అమెరికా ఆంక్షలు విధించింది. అలాగే చైనా ప్రభుత్వం కోసమే పనిచేస్తున్నాయని పేర్కొంటూ మరో 140 కంపెనీలను అమెరికా బ్లాక్ లిస్ట్‌లో చేర్చింది.