ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ నరకం
కంపెనీలకు సైబరాబాద్ పోలీసుల నోటీసులు
శేరిలింగంపల్లి, జూన్ 17 (విజయక్రాంతి): హైదరాబాద్ ఐటీ హబ్లో రోజురోజుకూ మితిమీరిపోతున్న ట్రాఫిక్ గందరగోళానికి తెరదించేందుకు సైబరాబాద్ పోలీస్ శాఖ కఠిన నిర్ణయాలు తీసుకోనుంది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం వంటి ప్రధాన ఐటీ జోన్లలో పీక్ అవర్స్లో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోతుండటంతో పోలీసులు క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు.
ట్రాఫిక్ జామ్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమవుతున్న ఐటీ కంపెనీలకు త్వరలోనే అధికారిక నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
రోడ్లపైనే పికప్‌లు, డ్రాపులు..
రోజుకు సుమారు 5 లక్షల మందికి పైగా ఐటీ ఉద్యోగులు మైండ్ స్పేస్, నాలెడ్జ్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు ప్రయాణిస్తుండటంతో రహదారులు ఊపిరాడకుండా పోతున్నాయి. డెలాయిట్ డ్రైవ్, సైబర్ గేట్వే, మైండ్ స్పేస్ రోటరీల వద్ద ఆఫీస్ క్యాబ్లు రోడ్డు మీదే ఆగి ఉద్యోగులను పికప్, డ్రాప్ చేస్తుండటం వల్ల వెనుక వచ్చే వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి.
మరోవైపు నిలోఫర్ కేఫ్ నుంచి ఐకియా, ఐటీసీ కోహినూర్ రోడ్డు ప్రాంతాల్లో యాప్ బేస్డ్ క్యాబ్ డ్రైవర్లు రైడ్స్ కోసం రోడ్డు పక్కనే వాహనాలను పార్క్ చేస్తున్నారు. దీంతో కంపెనీలు తమ క్యాబ్ పికప్, డ్రాప్ పాయింట్లను రోడ్లపై కాకుండా, సొంత క్యాంపస్ ప్రాంగణంలోనే కేటాయించుకోవాలని పోలీసులు నోటీసుల్లో స్పష్టం చేయనున్నారు.
రంగంలోకి పోలీసులు.. స్పెషల్ డ్రైవ్స్ షురూ..
ట్రాఫిక్ నియంత్రణ కోసం సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే ప్రత్యేక చర్యలు చేపట్టారు. వారాంతాల్లో రోడ్డు పక్కన అక్రమంగా పార్క్ చేసిన వాహనాలను టోయింగ్ చేస్తూ రూ. 1,000 జరిమానా విధిస్తున్నారు. పెండింగ్ చలాన్లను అక్కడికక్కడే వసూలు చేస్తున్నారు. రోడ్లపై వాహనాలు ఆగకుండా ఉండేందుకు క్వాల్కామ్ క్యాంపస్ సమీపంలో భారీ పెయిడ్ పార్కింగ్ జోన్ ఏర్పాటు చేయాలని భావిస్తూ, టీజీఐఐసీ తో చర్చలు జరుపుతున్నారు. త్వరలో ఐటీ కంపెనీల ప్రతినిధులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తో ఉన్నత స్థాయి మీటింగ్ నిర్వహించి శాశ్వత పరిష్కారం చూపించనున్నారు.
‘షిఫ్ట్ టైమింగ్స్’ మార్చాల్సిందే..
ఈ ట్రాఫిక్ సమస్యకు ఐటీ ఉద్యోగులు, నిపుణులు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. కంపెనీలన్నీ ఒకే సమయానికి కాకుండా, షిఫ్ట్ వేళల్లో కనీసం 30 నుండి 45 నిమిషాల వ్యవధి (స్టాగర్డ్ టైమింగ్స్) పాటించాలని కోరుతున్నారు. అలాగే ఉద్యోగులు వ్యక్తిగత వాహనాలను తగ్గించి మెట్రో, ఆర్టీసీ బస్సులు వంటి ప్రజా రవాణాను వాడాలని, ఒకే రూట్లో వెళ్లేవారు ’కార్ పూలింగ్’ పద్ధతిని అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఐటీ కంపెనీలు, ఉద్యోగులు సానుకూలంగా స్పందించి సహకరిస్తేనే ఐటీ కారిడార్లో ప్రయాణం సుఖమంతం అవుతుందని పోలీసులు స్పష్టం చేశారు.
ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటాం..
చాలా ఐటీ కంపెనీల్లో వాహనాల పార్కింగ్, పికప్-డ్రాప్ కోసం బోలెడంత స్థలం అందుబాటులో ఉన్నా, దాన్ని సరిగ్గా వినియోగించకుండా రోడ్ల మీద వాహనాలను ఆపుతున్నారు. ఈ సమస్యకు కారణ మయ్యే కంపెనీలను గుర్తించి త్వరలోనే వాటి కి నోటీసులు ఇచ్చి, ఉద్యోగుల రవాణా వల్ల పబ్లిక్ ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా సొంతంగా చర్యలు చేపడతాం.
పవన్ మయాస్, రాయదుర్గం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్






