అమరావతికి రైలు
- ఎన్డీఏ సర్కారు ఏర్పడిన తర్వాత బాబు తొలి విజయం
- సొంతంగా నిర్మించేందుకు ముందుకొచ్చిన కేంద్రం
- కొత్త మార్గంతో హైదరాబాద్ నుంచి నేరుగా రైలు
- హైదరాబాద్ నుంచి గుంటూరుకు తగ్గనున్న దూరం
హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఏర్పడి నెల రోజులు కూడా కాలేదు అప్పుడే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన సత్తా చాటారు. ఏపీ రాజధాని అమరావతికి రైలు మార్గాన్ని సాధించారు. గతంలో రాష్ట్రం, కేంద్రం సం యుక్త వాటాతో నిర్మించాల్సి ఉన్న అమరావతి కొత్త రైల్వే లైన్‌ను ఇప్పుడు కేంద్రం తానే సొంతంగా నిర్మిస్తానంటూ ముందుకువచ్చింది. భూసేకర ణకు గెజిట్ నోటిఫికే షన్ కూడా విడుదల చేసింది. గతంలోని నిబంధనలు కూడా తీసేసి సొంతంగానే నిర్మాణానికి ముందుకొచ్చింది.
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతికి..
సీఎంగా చంద్రబాబు తిరిగి బాధ్యతలు స్వీకరించాక రాష్ర్టంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. దాదాపు అందరూ మర్చిపోయిన అమరావతి మళ్లీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఏపీ రాజధానిగా అమరావతి కొత్త కళ సంతరించుకుంది. చంద్రబాబు కృషి ఫలితంగా అమరావతికి కొత్తగా రైలు మార్గం మంజూరైంది. సికింద్రాబాద్ విజయవాడ రైల్వే మార్గంలో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం రైల్వేస్టేషన్ నుంచి -అమరావతి మీదుగా గుంటూరు చేరుకునేలా కొత్తగా రైల్వే లైన్ వేయనున్నారు. ఇందుకు సంబంధించి భూ సేకరణ పనులు కూడా ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. సికింద్రాబాద్ విజయవాడ లైన్‌లో ఎర్రుపాలెం స్టేషన్ వద్ద కొత్త లైన్ మొదలై అమరావతి మీదుగా వెళ్తూ విజయవాడ గుంటూరు స్టేషన్ల మధ్య నంబూరు స్టేషన్ వద్ద కలుస్తుంది.
గతంలో అటకెక్కిన అమరావతి రైలు...
గతంలో అమరావతికి రైల్వే లైను ప్రతిపాదన ఉన్నా అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. అమరావతి రాజధానిగా ఉండటమే ఇష్టం లేని గత సర్కారు కొత్తగా రైలు మార్గం వేసేందుకు ఒప్పుకోదనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ టీడీపీ నేతృత్వంలో కూటమి అధికారంలోకి రావడంతో రైల్వేశాఖ ఆగమేఘాల మీద స్పందించింది. అమరావతి రైల్వే లైన్ భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.
రైల్వే లైనుకు రాష్ర్టం తన వాటా ఇవ్వాలని, భూసేకరణ వ్యయం భరించాలంటూ గతంలో అనేక నిబంధనలు పెట్టిన రైల్వే శాఖ ఇప్పుడు ఎలాంటి కొర్రీలు పెట్టకుండానే భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేయడం గమనార్హం. పూర్తిగా సొంత నిధులతోనే అమరావతికి రైల్వే లైన్ నిర్మించాలని నిర్ణయించింది. ఎర్రుపాలెం, -అమరావతి, -నంబూరు మధ్య భూసేకరణకు వీలుగా ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం 9 స్టేషన్లు
ఎర్రుపాలెం వద్ద కొత్త లైన్ మొదలై అమరావతి మీదుగా నంబూరు స్టేషన్ వరకు 56.53 కి.మీ మేర నూతన రైలు మార్గం నిర్మిస్తారు. ఈ సింగిల్ లైన్ రైలు మార్గానికి 450 హెక్టార్ల మేర రూ.2,600 కోట్లతో భూసేకరణ చేయనున్నారు. ఎర్రుపాలెం తర్వాత పెద్దాపురం, చిన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరులలో మొత్తం 9 స్టేషన్లు నిర్మిస్తారు. వీటిలో పెద్దాపురం, పరిటాల, అమరావతి, కొప్పురావూరు పెద్ద స్టేషన్లు. వీటిలోనూ అమరావతి ప్రధాన స్టేషన్‌గా ఉంటుంది. ఈ స్టేషన్‌ను విజయవాడ, గుంటూరుకు ప్రత్యమ్నాయంగా భారీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ లైన్‌లో భాగంగా కృష్ణానదిపై కొత్తపేట -వడ్డమాను మధ్య 3 కిలోమీటర్ల రైల్వే బ్రిడ్జి కూడా నిర్మిస్తారు.
నేరుగా హైదరాబాద్‌కు...
ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి కాజిపేట, ఖమ్మం మీదుగా విజయవాడ వెళ్లి అక్కడి నుంచి గుంటూరుకు రైల్వే మార్గం ఉంది. ఇప్పుడు ఇదే మార్గంలో ఎర్రుపాలెం స్టేషన్ నుంచి అమరావతి మీదుగా గుంటూరు సమీపంలోని నంబూరు వరకు రైలు మార్గం నిర్మించడం వల్ల హైదరాబాద్ నుంచి నేరుగా ఏపీ రాజధాని అమరావతికి రైళ్లో ప్రయాణించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అలాగే విజయవాడ వెళ్లకుండానే గుంటూరు చేరుకోవచ్చు. ఫలితంగా సమయం ఆదా అవ్వడమే కాకుండా విజయవాడ స్టేషన్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు వీలవుతుందని రైల్వే అధికారులు తెలిపారు.






