కొడంగల్‌కు కూ..చుక్‌చుక్
- గోవాకు దగ్గరి తోవ!
కృష్ణా వికారాబాద్ రైల్వేలైన్‌పై సర్వే
నెరవేరనున్న దశాబ్దాల కల
హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి) : హైదరాబాద్ నుంచి గోవా వెళ్లే వారికి మరో మార్గం అందుబాటులోకి రానుంది. వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా రాయచూరుకు సమీపంలో ఉన్న కృష్ణా రైల్వేస్టేషన్ వరకు కొత్త రైల్వే లైన్ నిర్మించేందుకు మార్గం సుగమమవుతున్నది. సికింద్రాబాద్ నుంచి వికారాబాద్ మీదుగా రాయచూర్ వెళ్లేందుకు ప్రస్తుతం తాండూరు, సేడం, చిత్తాపూర్, వాడి, యాద్గిర్ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా సమయం, ఇంధనం వృథా అవుతున్నది. సికింద్రాబాద్ నుంచి రాయచూరు చేరుకునేందుకు 290 కి.మీ దూరం అవుతుంది. ఈ మార్గానికి ప్రత్యమ్నాయంగా రైల్వే శాఖ వికారాబాద్ కృష్ణా మార్గాన్ని తెరపైకి తీసుకువచ్చింది. కొత్తమార్గం కోసం గత ఏడాది సర్వేకోసం రైల్వే శాఖ ఆదేశాలిచ్చింది.
రేవంత్‌రెడ్డి నియోజకవర్గానికి రైలు మార్గం
సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ఎంతో వెనకబడిన ప్రాంతం. సీఎం అయ్యాక ఆయన ఈ ప్రాంతం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇదే క్రమంలో రైల్వే శాఖ చేపడుతున్న కొత్త ప్రాజెక్టు కారణంగా కొడంగల్ నియోజవర్గానికి రైలు వచ్చే అవకాశం ఏర్పడింది. ఈ లైన్ వల్ల పరిగి, కొడంగల్, నారాయణపేట, మక్తల్ పట్టణాలకు రైల్వే కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. దాదాపు 4 దశాబ్దాల క్రితం ఈ రైల్వే లైన్ కోసం సర్వే చేసినా అప్పట్లో ప్రభుత్వాలు పట్టించుకోక పనులు అటకెక్కాయి.
100 కి.మీ. దూరం తగ్గే మార్గం
రూ. 2196 కోట్ల అంచనా వ్యయంతో రైల్వే శాఖ ప్రతిపాదించిన ఈ వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ పూర్తయితే కొడంగల్ నియోజకవర్గంతోపాటు వికారాబాద్, నారాయణ పేట జిల్లాలు ఎంతో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి రాయచూరు చేరుకునేందుకు ప్రస్తుతం వాడి, యాద్గిర్ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లడం వల్ల 290 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. వికారాబాద్ కృష్ణా కొత్త లైన్ వల్ల సుమారు 100 కి.మీ మేర దూరం తగ్గుతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి వికారాబాద్‌కు 72 కి.మీ దూరం కాగా... కొత్తగా 122 కి.మీ మేర లైన్ నిర్మించనున్నారు. ఫలితంగా సుమారు 100 కి.మీ దూరం తగ్గడంతో ప్రయాణికులకు, సరుకు రవాణాకు అత్యుత్తమ మార్గంగా ఈ లైన్ మారనుంది.
గోవాకు మరింత దగ్గర
ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి గోవా చేరుకునేందుకు వికారాబాద్, వాడి, యాద్గిర్, రాయచూరు, గుంతకల్ మీదుగా రైళ్లు తిరుగుతున్నాయి. మరో మార్గంలో కాచిగూడ, మహబూబ్‌నగర్, కర్నూలు, గుంతకల్, హుబ్లీ మీదుగా మరో మార్గం ఉంది. వికారాబాద్ కృష్ణా మార్గం అందుబాటులోకి వస్తే సుమారు 100 కి.మీ దూరం తగ్గుతుంది. ఇక రాయచూరు నుంచి మునీరాబాద్ వరకు నిర్మాణంలో ఉన్న రైల్వే లైన్ పనులు కూడా పూర్తయితే గోవాకు మరింత దగ్గరి మార్గం అందుబాటులోకి వస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.






