27 August, 2026 | 10:13 AM

శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి

22-06-2026 02:10 PM

కార్మిక చట్టాల పరిరక్షణకు ఉద్యమాలే శరణ్యం

సిపిఐ జిల్లా కార్యదర్శి, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ కె సాబీర్ పాషా

చుంచుపల్లి, (విజయక్రాంతి): ట్రేడ్ యూనియన్ శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో చుంచుపల్లి మండలం, గౌతంపూర్ సింగరేణి కమ్యూనిటీ హలో ఏర్పాటు చేసిన  కొత్తగూడెం ఏరియా యూనియన్ ప్రతినిధులు, కార్యకర్తలకు ట్రేడ్ యూనియన్ శిక్షణాతరగతులను సోమవారం అయన ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు నిర్వీర్యమవుతున్నాయని, వాటి పరిరక్షణకు ఉద్యమాలే శరణ్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగానికి తలమానికంగా ఉన్న సింగరేణి సంస్థపై కేంద్రం కన్నేసిందని, ప్రైవేటీకరణవైపు పరుగులుపెట్టిస్తోందని, ఈ పరిస్థితిలో సమిష్టి పోరాటాలతో సింగరేణిని రక్షించుకుందామని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణ కుట్రలను తిప్పికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యూనియన్ ప్రతినిధులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో తమ బాధ్యతలను విస్మరించొద్దని, నిరంతరం కార్మికులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు అండగా నిలవాలని ఆయన సూచించారు.