8 April, 2026 | 7:33 PM

వరి ధాన్యం కొనుగోలు సజావుగా నిర్వహించాలి

08-04-2026 05:41 PM

ఇతర రాష్ట్రాల ధాన్యం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు

కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ హెచ్చరిక

గద్వాల: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల నుంచి కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించాలని, అవకతవకలకు పాల్పడే వారిపై సస్పెండ్ వేటు తప్పదని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. బుధవారం ఐడిఓసి సమావేశపు మందిరంలో రబీ సీజన్ కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 87 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈనెల 9వ తేదీ నుంచి కొనుగోలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

రైతులు తాము పండించిన ధాన్యంను తమ కల్లాల వద్దే బాగా ఆరబెట్టుకుని వస్తే కొనుగోలు కేంద్రాల వద్ద ప్రత్యేకంగా ఆరబెట్టే అవసరం ఉండదన్నారు. ఈ విషయంలో సంబంధిత ఏఈవోలు అన్నదాతలకు అవగాహన కలిగించాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని, వివిధ రిజిస్టర్ లను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ముఖ్యంగా వరి ధాన్యం కొనుగోలు మరియు మిల్లులకు రవాణా చేసిన వివరాల రిజిస్టర్లో ప్రతి అంశాన్ని పూరించాలని ఆదేశించారు. ధాన్యం రకం, మిల్లుకు పంపిన తేదీ, తేమశాతం, తదితర వివరాలన్నీ పక్కాగా నమోదు చేయాలన్నారు.

రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాక వారికి 24 గంటల్లోనే డబ్బులు వచ్చేలా అవసరమైన ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నిర్దేశించిన క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనాలని, ఇతర రాష్ట్రాల ధాన్యం కొనుగోలు చేస్తే బాధ్యులపై సస్పెండ్ వేటు తప్పదని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం రాకుండా జిల్లాలోని ఎనిమిది చెక్ పోస్టుల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసే ఫ్లెక్సీల పై జిల్లా, రాష్ట్రస్థాయి కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లను రాయించాలన్నారు. వేసవి నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులతో పాటు ఆయా కేంద్రాల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, పౌర సరఫరాల జిల్లా అధికారి స్వామి కుమార్, మేనేజర్ విమల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరప్ప, తదితరులు పాల్గొన్నారు.