2 August, 2026 | 2:30 PM

ప్రధాన రోడ్డుపై ప్రైవేట్ అంబులెన్సుల నిలిపివేత

02-08-2026 01:27 PM

నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్

ట్రాఫిక్‌కు అంతరాయం వాహనదారుల ఇబ్బందులు

అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజల విజ్ఞప్తి

బాన్సువాడ, ఆగస్టు 2 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ప్రధాన రహదారిపై ప్రైవేట్ అంబులెన్సులను రోజూ రోడ్డు పక్కనే నిలిపివేస్తుండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్ అండ్ బి అతిధి గృహం, పోస్టాపిస్ వద్ద అంబులెన్సులు రోడ్డుపైనే నిలిపివేయడం వల్ల రహదారి మరింత ఇరుకుగా మారి ట్రాఫిక్‌కు ఆటంకం కలుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అత్యవసర సేవలకు వినియోగించాల్సిన అంబులెన్సులు గంటల తరబడి,రోజంతా రోడ్డుపైనే పార్క్ చేయడం సరైందేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే ఈ పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాల విద్యార్థులు, వృద్ధులు,స్కూల్ బస్సులు,ద్విచక్ర వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించే సమయంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై అక్రమ పార్కింగ్‌ను వెంటనే తొలగించి, ప్రైవేట్ అంబులెన్సులకు ప్రత్యేక పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.