త్వరలోనే ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ?
జాబితాలో జిల్లా కలెక్టర్లు, కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు
సీఎంవోలోనూ మార్పులు చేర్పులు
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. మెజార్టీ జిల్లా కలెక్టర్లతోపాటు ఆయా శాఖల కార్యదర్శులను, ముఖ్య కార్యదర్శులను కూడా బదిలీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సచివాలయవర్గాలు పేర్కొంటున్నాయి. సీఎంవోలోనూ మార్పులు, చేర్పులు ఉంటాయని అధికారవర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధానంగా రాజకీయాలపై దృష్టి పెట్టడంతో పరిపాలన కొంత గాడి తప్పింది. అయితే ఎన్నికల ప్రక్రియ ముగియడంతో సీఎం రేవంత్‌రెడ్డి పరిపాలనపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా అధికారులు, మంత్రులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్న సీఎం ఒకటిరెండు రోజుల్లో ఐఏఎస్ అధికారులను బదిలీ చేయాలని కూడా నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో మెజార్టీ ఐఏఎస్ అధికారులు ఎన్నికల సమయంలో బదిలీ అయ్యారు.
కొన్ని ముఖ్యశాఖలలో కీలక పోస్టులకు సంబంధించిన అధికారులను మినహాయిస్తే ప్రభుత్వం రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఐఏఎస్‌లను బదిలీ చేయలేదు. ఈ క్రమం లోనే రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లతోపాటు పలు శాఖల కార్యదర్శులను, ముఖ్య కార్యదర్శులను బదిలీ చేసే అవకాశం ఉందని సచివాలయవర్గాలు పేర్కొంటున్నాయి. ఐఏఎస్ లతోపాటు ఐపీఎస్ అధికారులు కూ డా ప్రభుత్వ బదిలీ జాబితాలో ఉన్న ట్టు సమాచారం. త్వరలోనే ఇందుకు ఉత్తర్వులు వెలువడనున్నాయి.
సీఎంవోలోనూ మార్పులు, చేర్పులు
సీఎంవోలోనూ మార్పులు చేర్పు లు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సీఎంవోలో కీలకంగా ఉన్న ఒకరిద్దరు అధికారులపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవచ్చని సీఎంవోలోని ఓ అధికారి ఇచ్చిన సలహాతో రేవంత్‌రెడ్డి మీటింగ్ ఏర్పాటుచేశారు. అయితే చివరి నిమిషంలో ఈసీ అభ్యంతరం చెప్పడం, ఈసీ అనుమతి తీసుకొన్న తర్వాతే క్యాబినెట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది.
అయితే ముందుగా తెలుసుకోకుండా ఎలా చెప్తారంటూ ఆ సీనియర్ ఐఏఎస్ అధికారిపై రేవంత్‌రెడ్డి కొంత అసహనం వ్యక్తం చేశారని సమాచారం. సీఎంవోలో ఉన్న ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కేంద్ర సర్వీసులకు వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేంద్ర సర్వీసులకు ఆయన డిప్యుటేషన్ కూడా ఖరారు అయినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన స్థానంలో కొత్త అధికారిని తీసుకోవడంతోపాటు సీఎంవో అధికారులు పర్యవేక్షిస్తున్న శాఖలను మార్చాలని సీఎం నిర్ణయించినట్టు సమాచారం.






