8 July, 2026 | 1:12 PM

సీఎంపై బీజేపీ ఫిర్యాదును విచారించాలి

11-06-2024 12:53 AM

మేజిస్ట్రేట్ కోర్టుకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, జూన్ 10(విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుపై చట్టప్రకారం నిర్ణ యం తీసుకోవాలని మేజిస్ట్రేట్ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. బీజేపీ చేసి న ఫిర్యాదులోని అంశాల జోలికి వెళ్లకుండా ౩ నెలలపాటు వాయిదా వేయడం సబబుకాదని తప్పుబట్టింది. రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఫిర్యాదును పరిశీలించి చట్టప్రకారం ఉత్తర్వులు జారీ చేయాలని సూచించింది.

బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెం జనజాతర సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారని, వాటిపై ఇచ్చిన ప్రైవేటు ఫిర్యాదుపై స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు విచారించకపోవడాన్ని సవాలు చేస్తూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే వెంకటేశ్వర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు.  దీనిని సోమవారం జస్టిస్ కే లక్ష్మణ్ విచారించారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది డీ విజయ్‌కుమార్ వాదనలు వినిపించారు.

400 సీట్లు ఇస్తే బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశారని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఫిర్యాదులోని అంశాలను పరిశీలించి అందులో ఆధారాలుంటే విచారణకు పరిగణనలోకి తీసుకుని నోటీసులు జారీ చేయడం, లేదంటే దర్యాప్తు నిమిత్తం పోలీసులకు పంపడం చేయాల్సి ఉండగా వాయిదా వేయడం సరికాదని అన్నారు. ఫిర్యాదును పరిశీలించి చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని మేజిస్ట్రేట్ కోర్టుకు ఆదేశాలు జారీ చేస్తూ బీజేపీ పిటిష్ప విచారణను మూసివేశారు.