04-02-2026 01:03:21 AM
అధికారులకు కలెక్టర్ రాజార్షి షా ఆదేశం
ఆదిలాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక టీటీడీసీ లో రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి నామినేషన్ ల ఉపసంహరణ, బి-ఫారాల పరిశీలన, గుర్తుల కేటాయింపు తదితర అంశాలపై ఆయన దిశ నిర్దేశం చేస్తూ, పలు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... నామినేషన్ల ఉపసంహరణ సమయంలో అనుసరించాల్సిన విధానం, రాజకీయ పార్టీలు సమర్పించే బి-ఫారాల పరిశీలనలో తనిఖీ చేయాల్సిన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం వార్డుల వారీగా అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు నిబంధనల ప్రకారం చేపట్టాలని సూచించారు.
ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎన్నికల నియమావళి మేరకు పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజు, నోడల్ అధికారి ఫణీందర్, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్, రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.