7 July, 2026 | 9:57 PM

పారదర్శకంగా ఎస్ఐఆర్ ప్రక్రియ

07-07-2026 08:37 PM

నిర్మల్,(విజయక్రాంతి): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఓటరు జాబితా ప్రత్యేక సవరణ, ఎస్ఐఆర్) ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపడతామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలో చేపట్టనున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియ వివరాలను సమగ్రంగా వివరించారు. ఇప్పటికే బూత్ లెవెల్ అధికారుల (బిఎల్ఓ ల) ద్వారా ఎన్యుమరేషన్ ఫాం ల పంపిణీ పూర్తయిందని తెలిపారు. ఓటర్లు నింపిన వివరాలతో కూడిన ఎన్యుమరేషన్ ఫారం లు జూలై 24 తేదీ వరకు తిరిగి తీసుకుంటారు అని వివరించారు. ప్రస్తుతం ఎన్యుమరేషన్ ఫాం ల స్వీకరణ, డిజిటలీకరణ ప్రక్రియ కూడా కొనసాగుతుందన్నారు. గడువులోగా డిజిటలీకరణ పూర్తి చేస్తామన్నారు.

అర్హులైన ఏ ఒక్క నిజమైన ఓటరు కూడా తమ ఓటు హక్కు కోల్పోకుండా, పారదర్శకంగా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేస్తామని అన్నారు. ప్రతి బుధవారం ఈఆర్వోల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ సందర్భంగా లేవనెత్తిన అంశాలను కలెక్టర్ వివరించారు. ప్రజల్లో మరింత అవగాహన కలిగేలా ఆటోల ద్వారా టామ్ టామ్ చేసి ప్రచారం కల్పిస్తామని తెలిపారు. హెల్ప్ డెస్క్ ల ద్వారా ఓటర్లకు సహాయం చేస్తున్నట్లు తెలిపారు.