విషజ్వరాల బారిన గిరిజన గురుకులం విద్యార్థులు

11-09-2026 | 04:25am

సంస్థాన్ నారాయణపూర్, సెప్టెంబర్ 10: నారాయణపురం మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాల(Tribal residential school) విద్యార్థులు విష జ్వరాల బారిన పడ్డారు. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 15 మంది విద్యార్థులు గత రెండు రోజులుగా జ్వరాల బారిన పడడంతో తోటి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరి కొంతమంది విద్యార్థులకు గజ్జి, తామర, జలుబు వంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు.

జ్వరాల బారిన పడ్డ విద్యార్థులను పాఠశాల సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఒకేసారి 15 మందికి గత రెండు రోజులుగా జ్వరాలు రావడంతో ప్రభుత్వ వైద్య ఆసుపత్రి డాక్టర్ జ్యోత్స్న సమక్షంలో సిబ్బంది ఆశ్రమ పాఠశాలను సందర్శించి వైద్య సేవలు అందిస్తున్నారు. అవసరమైన విద్యార్థులకు మందులను పంపిణీ చేశారు.

జ్వరం బారిన పడ్డ విద్యార్థులతో పాటు పాఠశాల విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి వైరల్ ఫీవర్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు ఇచ్చారు. మండలంలో ఉన్న వివిధ వసతి గృహాల విద్యార్థులను వారానికోసారి సందర్శించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవసరం ఉన్నవారికి మందులను అందజేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు