రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వ పాలన
కపిలవాయి దిలీప్‌కుమార్
హుజూర్‌నగర్‌లో ‘టీఆర్‌ఎల్డీ’ కార్యాలయం ప్రారంభం
హుజూర్‌నగర్, జూన్ 17: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ (టీఆర్‌ఎల్డీ) పార్టీ నూతన కార్యాలయాన్ని బుధవారం మాజీ ఎమ్మెల్సీ కపిలవా యి దిలీప్ కుమార్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎల్డీ సూర్యాపే ట జిల్లా అధ్యక్షుడు నరేందర్ గౌడ్, అధికార ప్రతినిధి గౌర బీరప్ప, కోశాధికారి గిరి కుండే, ప్రధాన కార్యదర్శులు నరసింహారావు, విశాల్ వంజరి, రిషబ్ జైస్ పాల్గొన్నారు. కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రె స్ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే అధ్వాన్నంగా పనిచేస్తోందని ఆరోపించారు.
మంత్రులు తెలంగాణను ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని, ముఖ్యమంత్రి సమర్థవంతమైన పాలన అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఇది ప్రజల ఆకాంక్షలకు దూరంగా ఉన్న ఒక అసమర్థ ప్రభుత్వమని ఆయన అభివర్ణించారు. యువతను స్వచ్ఛమైన, పారదర్శకమైన రాజకీయాల్లోకి ప్రోత్సహించేందుకు.. నిజాయితీ, నిబద్ధతతో ప్రజాసేవ చేయడానికే టీఆర్‌ఎల్డీని పునరుద్ధరించినట్లు దిలీప్ కుమార్ స్పష్టం చేశారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలన్నింటిలోనూ టీఆర్‌ఎల్డీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ జాతీయ అధ్యక్షుడు జయంత్ సింగ్ మార్గదర్శకత్వంలో జూన్ 27న వరంగల్‌లో భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు దిలీప్ కుమార్ వెల్లడించారు. అదే రోజున వరంగల్ వేదికగా ‘లక్ష్యం కోసం లక్ష సైన్యం‘ పేరుతో ఒక ప్రత్యేక యువజన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
టీఆర్‌ఎల్డీ అధికార ప్రతినిధి గౌర బీరప్ప మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్, కాం గ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజలను ఘోరంగా మోసం చేశాయని మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజలు పెట్టుకున్న ఆశయాలు నేటికీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు నరేందర్‌గౌడ్ మాట్లాడుతూ.. స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన కొత్త రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు వంటి హామీలలో ఒక్కదాన్ని కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదని విమర్శించారు.






