అతలాకుతలం!
మొంథా తుఫాన్ తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. మంగళవారం రాత్రి ఏపీలోని అంతర్వేది వద్ద తీరం దాటిన తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌లో బీభత్సం సృష్టించగా.. తెలంగాణలోనూ మొంథా తన పంజా విసిరింది. తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని చాలా జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఎడతెరిపి లేని వర్షం కురిసింది. దీంతో వాగులు, ఊళ్లు ఏకమవ్వ గా.. రహదారులు కోతలకు గురవ్వడంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.
ముఖ్యంగా హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, నల్గొండ, మెదక్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలు భారీ వర్షాలతో వణికిపోయాయి. అత్యధికంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 41.2 సెం.మీ వర్షపాతం నమోదవ్వగా, వరంగల్ జిల్లా పర్వ తగిరి మండలం కల్లెడలో 34.8 సెం.మీ కుంభవృష్టి కురిసింది. మున్నేరు వాగు ఉప్పొంగడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా, మూసీ నది కూడా ఉధృతంగా ప్రవహించడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా అతలాకుతలమయ్యా యి.
అయితే గురువారం రాత్రి వరకు వర్షాలు ఉండడంతో ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్‌తో పాటు గోదావరి పరివాహకంలోని 16 జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు ఏపీలోనూ మొంథా తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా 249 మండలాలు, 48 మున్సిపాలిటీల పరిధిలో 18 లక్షల మంది ప్రభావితమయ్యారు. సాధారణంగా వానాకాలం జూన్‌లో మొదలై సెప్టెంబర్‌తో ముగుస్తుంది.
అక్టోబర్ నుంచి ఈశాన్య రుతుపవనాల ప్ర భావంతో చెడగొట్టు వానలు ఎక్కువగా పడుతుంటాయి. రాష్ట్రంలో ఏ డాది సగటు వర్షపాతం 923.8 మి.మీ అయితే.. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,109 మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణంతో పోలిస్తే 34 శాతం అధికం కావడం గమనార్హం. జూన్, జూలైలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడగా.. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో మాత్రం వానలు దంచి కొడుతున్నాయి.
ఎల్‌నినో ప్రభావం, పర్యావరణ మార్పులతో అవసరం లేనప్పు డు వానలు దంచికొట్టడం, వరుసగా అల్ప పీడనాలు ఏర్పడడం, క్లౌడ్ బరస్ట్ విచ్ఛిన్నాలు జరుగుతున్నాయి. అయితే వానాకాలం పంటల సాగు మొ దలైనప్పటి నుంచి రైతన్నలపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. తొలుత అనావృష్టి, తర్వాత అతివృష్టి, ఇప్పుడు చెడగొట్టు వానలు రైతులను ఆగమాగం చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నీటి పాలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.
ఒకవైపు ప్రభుత్వం పంటల కొనుగోళ్ల కేంద్రాల ఏర్పాటుకు సన్నద్ధమవుతున్న తరుణంలో చేతికొచ్చిన ధాన్యం, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు చెడగొట్టు వానలతో తడిసిపోవటం, తేమ సమస్యలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు వాతావర ణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సమాచారం అందించే ఐఎండీ (భారత వాతావరణ శాఖ) మొంథా తుఫాను విషయంలో మా త్రం అంచనాలు తప్పినట్లుగా అనిపిస్తుంది.
ఐఎండీ వివరాల ప్రకారం మొంథా తుఫాను కోస్తాంధ్ర నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశాల వైపు వెళ్తుందని భావించినప్పటికీ అనూహ్యంగా దిశను మార్చుకున్న తుఫాన్ తెలంగాణ మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్ వైపు కదలడంతో రాష్ట్రాన్ని అకాల వర్షాలు ముంచెత్తాయి.




