14 April, 2026 | 1:52 PM

జాతీయ సమైక్యతా వారధి

31-10-2025 12:00 AM

నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి :

స్వాతంత్య్ర సమరయోధుడు, భారత తొలి ఉప ప్రధాని,హోంమంత్రిగా దేశ స్వాతంత్య్రానంతరం స్వదేశీ సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేసిన ఉక్కు మనిషి, ‘ఇండియన్ బి స్మార్క్‌గా’ పేరు పొందిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన జయంతిని (అక్టోబర్ 31) పురస్కరించుకొని యావత్ భారతావని ‘జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటుంది. స్వాతంత్రోద్యమ సమయంలో 1917లో గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో గాంధీ నడిపిన ఉద్యమంలో పటేల్ స్వయంగా పాల్గొన్నారు.

అదే సమయంలో గుజరాత్‌ను ‘ప్లేగు’ వ్యాధి ముంచెత్తడంతో వందలాది మంది మృత్యువాత పడ్డారు. దీనికి తోడు కరు వు సంభవించింది. ప్రజలను ఆదుకోవాల్సింది పోయి, రైతులను పన్నులు కట్టమని బ్రిటీష్ ప్రభుత్వం బలవంతపెట్టింది. దీనిని నిరసిస్తూ రైతులకు మద్దతుగా గాంధీ పిలుపు మేరకు పటేల్ కాలినడకన గ్రామాలన్ని తిరిగి రైతులకు అండగా నిలిచారు. ఈ ఉద్య మం ద్వారానే పటేల్‌ను ‘సర్దార్’ అని పిలిచారు.

1947లో భారత్‌కు స్వా తం త్య్రం సిద్ధించే నాటికి భారత్ లో 565 స్వదేశీ సం స్థానాలు ఉన్నాయి. వీటిలో కశ్మీర్, జు నాగడ్, హైదరాబా ద్ మిన హా మిగిలినవి పటేల్ కృషితో బేషరతుగా ఇండియన్ యూ నియన్‌లో అంతర్భాగమయ్యాయి. మిగతా మూడు సం స్థానాలను భారత్‌లో విలీనం చేయడానికి పటేల్ పట్టుదలతో వ్యవహరించారు. వీటిలో ముఖ్యమైనది హైదరాబాద్ సంస్థానం. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని ముస్లిం రాజ్యంగా చేయడానికి ప్ర యత్నాలు ప్రారంభించారు.

తమ సంస్థానికి సొంత కరెన్సీ, రైల్వే, సైనిక వ్యవస్థలు ఉండడంతో కొంతకాలం తర్వాత భారత యూనియన్‌లో హైదరాబాద్‌ను విలీనం చేస్తానని నిజాం ప్రతిపాదించారు. నిజాం వైఖరి పట్ల అనుమానంతో పటేల్ దానికి ఒప్పుకోలేదు. ఇదే సమయంలో నిజాం సంస్థానంలో రజాకార్లు మతకల్లోలాన్ని సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. భారత ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి లక్ష మంది సై న్యంతో సిద్ధంగా ఉందని హైదరాబాద్ ప్రధాని మీర్ లాయక్ అలీ పేర్కొన్నారు.

విషయం తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేసిన పటేల్ ‘ఆపరేషన్ పోలో’ పేరుతో ఇండియన్ ఆర్మీని హైదరాబాద్‌కు పంపారు. అలా 1948 సెప్టెంబర్ 13 నుంచి 18 వరకు హైదరాబాద్ మేజర్ జనరల్ జెఎన్ చౌదురి నాయకత్వంలో పోలీసు చర్యకు తలొగ్గిన నిజాం వల్లభాయ్ పటేల్ ముందు లొంగిపోయారు. దీంతో హైదరాబాద్ భారత్ యూనియన్‌లో భాగమైంది. ప్రస్తుతం గందరగోళంగా ఉన్న కశ్మీర్ అంశాన్ని కూడా ఆనాడే పటేల్‌కు అప్పగించే ఉంటే సమస్య వచ్చేది కా దేమో.

పటేల్ ఒక వైపు సంస్థానాల విలీనంతో పాటు మరోవైపు భారత పరిపాలన వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు కూడా కృషి చేశారు. ఆయనను అఖిల భారత సివిల్ సర్వీసుల పితామహుడుగా అభివర్ణిస్తారు. అంతిమంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పాలన దక్షతకు, నీతి నిజాయితీకి, ధృడ సంకల్పానికి మా రుపేరు. జాతి సమైక్య సారధిగా, నవభారత వారధిగా భా రతదేశ చరిత్ర లో పటేల్ స్థానం చిరస్మరణీయం.

 శెగ్గారి వరుణ్, 9912864973