27 August, 2026 | 2:51 PM

కవితక్క సభ విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు

20-06-2026 07:34 PM

* సభ విజయాన్ని జీర్ణించుకోలేకే ఫ్లెక్సీలు దహనం

* టీఆర్ఎస్ జిల్లా ఇంచార్జి:  మజీద్

సిరిసిల్ల,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈనెల 18న నిర్వహించిన టీఆర్ఎస్ అధినేత కవితక్క జెండా పండుగ, భారీ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని టీఆర్ఎస్ జిల్లా ఇంచార్జి మజీద్ పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ, సభకు జిల్లాలోని పలు మండలాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి అపూర్వ ఆదరణ చూపారని అన్నారు. సభ విజయవంతం కావడంతో కొందరు రాజకీయ ప్రత్యర్థులు భయభ్రాంతులకు గురయ్యారని, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కేసీఆర్ నగర్‌లో టీఆర్ఎస్ నాయకుడు కదిరే భాస్కర్ గౌడ్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని దుండగులు తగలబెట్టడం దురదృష్టకరమని విమర్శించారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కవితక్క పర్యటనకు ప్రజల నుంచి లభించిన స్పందనను జీర్ణించుకోలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉందని, రాజకీయ ద్వేషంతో ఇలాంటి చర్యలు చేయడం సరికాదన్నారు. సిరిసిల్ల సభను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించినప్పటికీ ప్రజల మద్దతుతో కార్యక్రమాన్ని విజయవంతం చేశామని తెలిపారు. ఫ్లెక్సీ దహనం ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను మజీద్ కోరారు.